పవన్ అభిమానులకు గుడ్ న్యూస్..ఓటీటీలో ‘అంత ఇష్టమేందయ్యా’ సాంగ్!

మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత ‘వకీల్ సాబ్’గా రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తు్న్నారు. ఆయన నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం గత నెల 25న థియేటర్స్‌లో విడుదలై సక్సెస్ అయింది. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ ఫిల్మ్‌కు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సంగతులు పక్కనబెడితే చిత్ర విడుదలకు ముందర విడుదలైన ‘అంత ఇష్టమేందయ్యా’ సాంగ్ సినిమాలో లేకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా సీరియస్‌గా సాగిపోతున్న క్రమంలో పాట పెట్టడం వల్ల స్టోరి డిస్ట్రబ్ అవుతుందని, అందుకే పాటను తీసేశామని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రంలో పాటనే హైలైట్‌గా నిలుస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ, వెండితెరపైన ఆ పాటకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ పాటను ఓటీటీ రిలీజ్ వర్షన్‌లో కంపల్సరీగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో పాటకు సంబంధించిన విజ్యువల్స్ కనబడుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రం ఓటీటీలో ఈ నెల 25న విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆ రోజు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల హడావిడి ఉంటుందనే నేపథ్యంలో ఒక రోజు ముందుకు ప్రీ పోన్ చేశారు. అలా ఈ నెల 24న ఓటీటీలు డిస్నీ హాట్ స్టార్, ఆహాల్లో చిత్రం విడుదల కానుంది. ఇందులో పవన్ కల్యాణ్‌కు జోడీగా నిత్యా మీనన్ నటించగా, నెగెటివ్ రోల్ దగ్గుబాటి రానా పోషించారు. ఆయన సరసన హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటించింది.