2023లో మళ్లీ సక్సెస్ కొట్టడానికి వస్తున్న హిట్ జోడీలు

-

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్-హీరో కాంబో, హీరో-హీరోయిన్ కాంబో, డైరెక్టర్-ప్రొడ్యూసర్ కాంబో, డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబో.. ఇలా రకరకాల కాంబోల గురించి మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా హీరో-హీరోయిన్ కాంబో కాస్త స్పెషల్. హీరో హీరోయిన్ల పెయిర్ ఎంత బాగా ఉంటే.. ఆ సినిమాకు అంత క్రేజ్. అలా టాలీవుడ్​లో ఇప్పటికే చాలా జంటలున్నాయి. ఎన్టీఆర్‌ – సావిత్రి, కృష్ణ – విజయనిర్మల, శోభన్‌బాబు – శ్రీదేవి, చిరంజీవి – రాధ, బాలకృష్ణ – విజయశాంతి, వెంకటేష్‌ – సౌందర్య… ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయే కాంబినేషన్లు చాలానే.

ఆ జంటలు మరోసారి జట్టు కడుతున్నారంటే చాలు… ప్రేక్షకుల్లో అమాంతం అంచనాలు పెరిగిపోయేవి. అలాంటి జంటలను కలిపి మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని దర్శకనిర్మాతలు కూడా ఆశపడుతుంటారు. అలా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని హిట్ జోడీలున్నాయి. మళ్లీ ఈ జంటలు కలిసి 2023 బాక్సాఫీస్​ను షేక్ చేయడానికి వస్తున్నారు. మరి ఆ హిట్ జోడీలెవరో చూద్దామా..?

 

మహేష్‌బాబు – పూజాహెగ్డే జోడీ ‘మహర్షి’తో తొలిసారి సందడి చేసింది. ప్రస్తుతం అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ ఆ ఇద్దరినీ కలిపి సినిమా చేస్తున్నారు. మహేష్‌ – త్రివిక్రమ్‌ఎలాగో, త్రివిక్రమ్‌ – పూజాహెగ్డే కలయిక కూడా అంతే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పూజాహెగ్డే నటించిన ‘అరవింద సమేత’,  ‘అల వైకుంఠపురములో’ విజయాలు అందుకున్నాయి. అందుకే మహేష్‌ – పూజాహెగ్డే – త్రివిక్రమ్‌ కలయిక ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణని సంతరించుకుంది.

 

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న మరో రిపీట్‌ జోడీ రామ్‌చరణ్‌ – కియారా అడ్వాణీ. ఈ ఇద్దరూ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఆడిపాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కలిసి నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

అల్లు అర్జున్‌ – రష్మిక.. జంట ‘పుష్ప’తో ప్రేక్షకలోకాన్ని ఊపేసింది. ఇప్పుడు కొనసాగింపుగా రూపొందుతున్న ‘పుష్ప2’ చిత్రంలోనూ ఈ జోడీ సందడి చేయనుంది.

 

విజయ్‌ దేవరకొండ – సమంత జోడీ ‘మహానటి’లో మంచి వినోదం పంచింది. ‘ఖుషి’ కోసం ఈ ఇద్దరూ మరోసారి కలిశారు.  ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఆ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగచైతన్య – కృతిశెట్టి జంట ‘బంగార్రాజు’తో ఆకట్టుకుంది. చిన్న సోగ్గాడిగా నాగచైతన్య, సర్పంచి నాగలక్ష్మిగా కృతిశెట్టి సందడి చేశారు. ఆ ఇద్దరూ ఇప్పుడు ‘కస్టడీ’ కోసం జట్టు కట్టారు.

నాని – కీర్తి సురేష్‌ జంటగా  ‘నేను లోకల్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ‘దసరా’ కోసం వీళ్లిద్దరూ మరోసారి ఆడిపాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news