రామ్‌, కిషోర్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి !

హీరో రామ్ తెలుగులో అత్యంత ఎన‌ర్జిటిక్ హీరో. ఇమేజ్‌కి అతీతంగా రాణిస్తుంటారు. వివాదాల‌కు, గాసిప్స్ కి దూరంగా ఉంటూ ఎక్కువ‌గా ప్రైవేట్ లైఫ్ ని గ‌డుపుతుంటారు. హీరోగా ఇటీవ‌ల త‌న సినిమాలు వ‌రుస‌గా ప‌ర‌జ‌యాలు చెందుతుండ‌టంతో ఇప్పుడు చాలా సెల‌క్టీవ్‌గా వెళుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారి ‘ఇస్మార్ట్ శంక‌ర్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. డ‌బుల్ దిమాక్ క్యాప్ష‌న్ తో వ‌స్తున్న ఈ సినిమా వ‌చ్చే నెల‌లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది. తాజాగా మ‌రో సినిమాకి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

ఇటీవ‌ల సాయి తేజ్ హీరోగా ‘చిత్ర‌ల‌హ‌రి’తో ఘ‌న విజ‌యాన్ని అందుకున్న కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నార‌ట‌. గ‌తంలో కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలోనే రామ్ ‘నేను శైల‌జ’ సినిమా చేశారు. స‌రికొత్త ప్రేమ క‌థ‌గా తెర‌కెక్కి ఇది మంచి విజ‌యం సాధించి దాదాపు ఆరు ఫ్లాప్స్ లో ఉన్న‌రామ్‌కి రిలీఫ్ నిచ్చింది. రామ్ తిరిగి హీరోగా పుంజుకునేలా చేసింది. ఆ సినిమా త‌ర్వాత కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ‘ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ’లో న‌టించారు. స్నేహం, ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ ప్ర‌ధానంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద ప‌రాజ‌యం చెందిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు రామ్ ఆస‌క్తిగా ఉన్నార‌ట‌.

అయితే ఇది రీమేక్ సినిమా అనే వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ ‘త‌డ‌మ్’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వి కిషోర్ సొంతం చేసుకున్నారు. దాన్ని రామ్ హీరోగా రీమేక్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇదే సెట్ అయితే రామ్‌కి కిషోర్ మరో హిట్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి. అరుణ్ విజ‌య్ హీరోగా మాగిజ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘త‌డ‌మ్’ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుద‌లై దాదాపు రూ.50కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది.