మీ ముఖాన్ని స్కాన్ చేసి ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ తరహా సేవలను స్పెయిన్ లోని కైక్సా బ్యాంకు అక్కడి తన కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.
నేడు టెక్నాలజీ రంగంలో వస్తున్న అనేక మార్పుల వల్ల మనకు చాలా వరకు బ్యాంకింగ్ పనులు సులభంగా జరుగుతున్నాయి. నగదు డిపాజిట్ మొదలుకొని అనేక పనులను మనం చాలా సులభంగా చేసుకుంటున్నాం. నగదు ట్రాన్స్‌ఫర్‌కైతే ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి డబ్బులు అకౌంట్లలో వేసి రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం క్షణాల సమయంలోనే మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ల ద్వారా నగదును ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. అలాగే డబ్బులు కావల్సి వచ్చినప్పుడు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసుకుంటున్నాం. అయితే ఇకపై ఈ ఏటీఎం విత్ డ్రా విషయంలో మరిన్ని సాంకేతిక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
సాధారణంగా మనం డెబిట్ లేదా ఏటీఎం కార్డులు ఉంటేనే వాటి సహాయంతో ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇక వాటిని ఏటీఎం మిషన్‌లో పెట్టినప్పుడు కచ్చితంగా పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. అయితే ఒక్కోసారి కొందరు ఏటీఎం పిన్ నంబర్లను మరిచిపోతుంటారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇకపై మీ ముఖాన్ని స్కాన్ చేసి ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ తరహా సేవలను స్పెయిన్ లోని కైక్సా బ్యాంకు అక్కడి తన కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.
ముఖాన్ని స్కాన్ చేసి ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలనుకునే కస్టమర్లు ముందుగా బ్యాంకుకు వెళ్లి తమ ముఖాన్ని స్కాన్ చేయించుకోవాలి. అక్కడ ఉండే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో కస్టమర్ ముఖాన్ని బ్యాంక్ వారు స్కాన్ చేస్తారు. ఈ క్రమంలో కస్టమర్ ముఖంలోని 16వేల సూక్ష్మమైన భాగాలను సదరు సాఫ్ట్‌వేర్ స్కాన్ చేసి స్టోర్ చేసుకుంటుంది. తరువాత ఎప్పుడైనా కస్టమర్ ఏటీఎంలో తన ముఖాన్ని స్కాన్ చేయగానే.. అప్పుడు మెషిన్ దాన్ని యాక్సెప్ట్ చేసి కస్టమర్ కోరుకున్న విధంగా బ్యాంక్ లావాదేవీలను చేపడుతుంది. నగదు అంటే నగదు లేదా ఇతర సేవలను ఏటీఎం అందిస్తుంది. ప్రస్తుతం ఈ సేవలు కైక్సా బ్యాంకులోనే అందుబాటులో ఉన్నా.. ప్రపంచంలోని ఆయా దేశాల్లో ఉన్న ప్రముఖ బ్యాంకులు కూడా త్వరలో ఇదే తరహాలో సేవలను అందించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు..!