చ‌దువు మానేసి టీవీ చూస్తుంద‌ని.. 5 ఏళ్ల కూతుర్ని చిత‌క‌బాది చంపిన త‌ల్లి..!

సాధార‌ణంగా 5 సంవ‌త్సరాల వ‌య‌స్సు ఉన్న పిల్లలు అంటే.. ఆ వ‌య‌స్సులో వారు అల్ల‌రి కాక మ‌రేం చేస్తారు చెప్పండి. త‌మ ముద్దు ముద్దు మాట‌ల‌తో.. బుడి బుడి అడుగుల‌తో త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు వినోదం క‌లిగిస్తుంటారు. అలాంటి ప‌సికందుల‌ను చదువు పేరు చెప్పి ఇబ్బందులు పెట్ట‌కూడ‌దు, వేధించ‌కూడ‌దు. కానీ.. ఆ త‌ల్లికి అదేమీ తెలియ‌న‌ట్లుంది.. అందుకనే ఆ 5 ఏళ్ల పాప‌ను చ‌ద‌వ‌డం లేద‌ని చెప్పి చిత‌క‌బాదింది. దీంతో ఆ పసిహృదయం విల‌విలలాడిపోయింది. త‌గ‌ల‌రాని చోట త‌గిలిందేమో.. తీవ్ర గాయాల‌కు గురై ఆ ప‌సికందు మృతి చెందింది. త‌మిళ‌నాడులో ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది.

త‌మిళ‌నాడులోని తిరుచ్చి జిల్లా కాట్టుపుదూరులో నివాసం ఉండే నిత్య క‌మ‌ల అనే మ‌హిళ స్థానికంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తోంది. ఆమె కుమార్తె పేరు ల‌తికా శ్రీ (5). కాగా ల‌తికా శ్రీ ఎంత చెప్పినా విన‌డం లేద‌ని, ప‌దే ప‌దే టీవీ చూస్తుందని చెప్పి ఆమె త‌ల్లి నిత్య క‌మ‌ల ఆమెను చిత‌క‌బాదింది. దీంతో లతికా శ్రీ తీవ్రగాయాల‌కు గురి కాగా, ఇరుగు పొరుగు వారు ఆమెను హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు.

కాగా ల‌తికా శ్రీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పోలీసులు నిత్య క‌మ‌ల‌ను అరెస్టు చేశారు. అలా ఆ త‌ల్లి త‌న కుమార్తెను చ‌దువు పేరు చెప్పి నిర్దాక్షిణ్యంగా హింసించడంతో ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ ఘ‌ట‌న వైర‌ల్‌గా మారింది. చాలా మంది దీనిపై స్పందిస్తున్నారు. ప‌సికందును చ‌దువు పేరు చెప్పి చంపేసిన త‌ల్లిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు..!