టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా పవన్ బాసంశెట్టి తెరకెక్కించిన సినిమా రంగబలి. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. జులై 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాగశౌర్య, సత్య కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ఓ ఊపు ఊపిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌వేదికగా ఆగస్టు 4న ‘రంగబలి’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సౌత్ ఇండియా వెల్లడించింది. ఇంకెందుకు ఆలస్యం మరి.. ఓటీటీలోకి రాగానే ఈ చిత్రం చూసేయండి మరి.
ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. : శౌర్య (నాగశౌర్య)కు తన ఊరు రాజవరం అంటే పిచ్చి ప్రేమ. ఏదేమైనా సరే సొంతూరులోనే కింగులా బతకాలి అనుకుంటాడు. శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) ఊళ్లోనే మెడికల్ షాపు నిర్వహిస్తూ గౌరవంగా జీవిస్తుంటాడు. తన కొడుక్కు ఆ షాపు బాధ్యత అప్పగించాలన్నది ఆయన కోరిక. అయితే శౌర్య మాత్రం ఊళ్లో గొడవలు పెట్టుకుంటూ.. సొంత షాపులోనే చిల్లర దొంగతనాలు చేస్తూ సరదాగా బతికేస్తుంటాడు. అతన్ని దారిలో పెట్టాలన్న ఉద్దేశంతో బలవంతంగా వైజాగ్ పంపిస్తాడు విశ్వం. అక్కడ తండ్రి కోరిక మేరకు ఫార్మసీ ట్రైనింగ్ కోసం ఓ మెడికల్ కాలేజీలో చేరతాడు శౌర్య. అక్కడే సహజ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. వీళ్ల ప్రేమకు సహజ తండ్రి (మురళీ శర్మ) తొలుత అంగీకారం తెలిపినా.. శౌర్యది రాజవరం అని తెలిసి పెళ్లికి అడ్డు చెబుతాడు. దీనికి కారణం ఆ ఊర్లోని రంగబలి సెంటర్. మరి ఆ సెంటర్ కథేంటి? దానికి రంగబలి అన్న పేరు ఎందుకొచ్చింది? ఈ సెంటర్‌కు మురళీ శర్మకూ. ఆ ఊర్లోని ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో)కు ఉన్న సంబంధం ఏంటి? ఈ సెంటర్ పేరు మార్చి.. తన ప్రేమను పెళ్లి పీటలెక్కించేందుకు శౌర్య ఏం చేశాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.