మలయాళీ ముద్దుగుమ్మ అయిన సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక మొదటగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. హైబ్రిడ్ పిల్ల అంటూ తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఏ రేంజ్ లో పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల తన కోసమే డైలాగ్ రాసినట్లుగా మార్చేసుకుంది.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆమె డాన్స్ కి చాలా మంది యువత ఆకర్షితులవుతున్నారు. ఇక సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్న సాయి పల్లవి.. తాజాగా నటించిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమా ఈనెల 17వ తేదీన అనగా మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం గత వారం రోజులుగా హైదరాబాద్ లోనే బిజీగా ఉంది సాయి పల్లవి. ఇటీవల విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా 15 రోజుల సమయాన్ని కేటాయించింది. ఇక ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కూడా ఈ విధంగా ప్రమోషన్స్ కోసం తమ సమయాన్ని కేటాయించడం లేదు అని చెప్పవచ్చు.
ప్రమోషన్స్ కోసం అదనపు చార్జీలు కూడా వసూలు చేయడం లేదు. అంతే కాకుండా ప్రతీ హీరోయిన్ కూడా వారితో పాటు మరో ముగ్గురు నలుగురు సిబ్బంది తీసుకొస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం సింగిల్ గానే వస్తుంది. వారికి కూడా డబ్బులు తన పారితోషికం నుంచే ఇస్తుంది. ఒకవేళ ఇంటర్వ్యూకి వస్తే ఉదయం 9 గంటలకు ముందుగానే వస్తుంది. ఇంకా కొన్నిసార్లు అయితే ఇంటర్వ్యూయర్ ల కన్నా ముందే రావడం గమనార్హం. అంతేకాకుండా ఈమె ఫుడ్డు కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇక ప్రయాణించడానికి ఖరీదైన కార్లు కూడా కావాల్సిన అవసరం లేకుండా సర్దుకుపోతూ ఉంటుంది. ఇక నిర్మాతలకు ఖర్చు తగ్గించే విధంగా చూసుకుంటుంది కాబట్టి నిర్మాతల హీరోయిన్ అని ఈమెకు ముద్ర పడిపోయింది.