సోన్ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసి హీరో అని పిలిపించుకున్నాడు. అయితే ఇటీవలే ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లి ఓ ఇంటి ముందు ఉన్న ఖరీదైన షూను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే, సదరు స్విగ్గీ డెలివరీ బాయ్‌కి ఇప్పుడు సోనూసూద్ అండగా నిలిచాడు. అతడిపై కంపెనీ కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోరాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హార్ట్ టచింగ్ ట్వీట్ చేశాడు సోనూ సూద్.
‘స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ సమయంలో ఏదైనా ఇంటి ముందు షూ చోరీ చేస్తే.. అతడిపై చర్యలు తీసుకోకండి. బదులుగా కొత్త షూ కొనివ్వండి. అతడికి అవి అవసరం కావొచ్చు. దయగా ఉండండి’ అంటూ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నటుడి చర్యను వ్యతిరేకిస్తున్నారు. “దొంగతం ఏ విధంగానూ మంచిది కాదని, దాన్ని ప్రోత్సహించడం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. ‘చోరీని సమర్ధించడం సరికాదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.