విష్ణు.. నారాయణ.. అచ్యుత ఇలా అనేక నామాలు కలినగి స్థితికారకుడు విష్ణుమూర్తి. ప్రధానంగా దశావతారాలు ధరించి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడు. ఇవే కాకుండా అనేక రకాలుగా అవతారాలు ఎత్తి పాపులను శిక్షించాడు. అర్చితావతారమూర్తిగా భక్తులను రక్షిస్తున్నాడు. అయితే కలియుగంలో పూర్వ యుగాలలాగా నియమ నిబంధనలతో, నిష్ఠతో పూజలు, యాగాలు, జపాలు, తపస్సు ఆచరించండం చాలా కష్టం. కాబట్టి దీంతో భక్తులు కలి నుంచి రక్షించడానికి నారాయణుడు కారుణ్యంతో ఇచ్చిన శక్తివంతమైన నామాల గురించి తెలుసుకుందాం.. ద్వాపరయుగం తర్వాత కలియుగం వస్తుంది.
కాబట్టి భక్తులను కాపాడాలన్న ఉద్దేశంతో శ్రీకృష్ణుడు పరమభక్తుడైన భీష్మ పితామహతో ఈ నామాలను చెప్పిస్తాడు. విష్ణు సహస్రనామాలను భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. కురుక్షేత మహాసంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. సుమారు నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ శ్రీకృష్ణుడి హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు. పాండవులు కంగారుపడి ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. దీనికి కృష్ణుడు ‘మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః’కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ము నన్ను స్మరించుకుంటున్నాడు.. అందుకే నామనస్సు అక్కడికి మళ్లింది. పాండవులారా బయలుదేరండి అక్కడకు మనం వెళ్దాం.. అని చెప్పి వారిని వెంటబెట్టుకుని వెళ్లాడు. ఈ సమయంలోనే శ్రీకృష్ణుని భీష్ముడు స్తుతిస్తూ విష్ణు సహస్రనామాలను ఉపదేశం చేశాడు.
ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం ‘ధర్మార్థులకు ధర్మం, అర్థార్థులకు అర్థం, కామార్థులకు కామం, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును’ అని పేర్కొన్నారు.
నామాలే ఎందుకు?
జపం, తపం వంటి వాటికి కఠినమైన నియమ నిబంధనలు ఉంటాయి. కానీ నామం అందరూ చెప్పవచ్చు. నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. శాస్త్రంలో మంచం మీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు. ‘దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్! కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!!’ బుధ గ్రహం బలహీనంగా ఉండి నీచ క్షేత్రం ఉంటే సమస్యలు ఎదురైనప్పుడు విష్ణు సహస్రనామాలు పటించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారని శాస్త్ర వచనం.
ఈ విష్ణుసహస్రనామాన్ని వారి వారి జన్మనక్షత్రాలకు ఒక శ్లోకం ఉంటుంది. ఆయా శ్లోకాలను నిత్యం పారాయణం చేసుకుంటే సకల కార్యజయం లభిస్తుంది. అంతేకాదు గ్రహదోషాల నుంచి శ్రీఘ్రంగా, సులభంగా విముక్తి పొందవచ్చు. అంతేకాదు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వేదాలను చదివిన ఫలితం వస్తుంది. కలియుగంలో తరించడానికి, సమస్యల నుంచి, రోగాల నుంచి విముక్తి పొందడానికి విష్ణు సహస్రనామాలు అత్యద్భుతమని పలువురు పండితులు పేర్కొంటున్నారు. అంతేకాదండోయో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు నిత్యం పారాయణం/శ్రవణం చేస్తే తప్పక వాటిని విముక్తి లభిస్తుందని సనాతన వైద్యపితామహుడు శుశ్రుతుడు చరకసంహితలో పేర్కొన్నారు. ఇక ఆలస్యమెందుకు ఆ నామాలను నిత్యం చదవండి అదీ వీలుకాకుంటే వినండి. అర్థం తెలుసుకుంటే మరీ ఎక్కువ ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు.
– కేశవ