దుర్గాదేవి శాంత స్వరూపిణిగా ఉన్న దేవాలయం ఎక్కడుందో తెలుసా?

-

అదిశక్తి.. పలు అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. అన్ని రూపాలు దాదాపుగా ఉగ్రరూపమే అనేది అందరికీ తెలిసింది. అటువంటి మాయమ్మ దుర్గమ్మ శాంత రూపిణిగా ఉన్న దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా.. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం…..
దుర్గాదేవి అంటేనే రక్కసుల పాలిట సింహస్వప్నం. అలాంటి దుర్గాదేవి శాంత స్వరూపమే శాంతదుర్గ.

సయోధ్య కుదిర్చిన శాంతమూర్తి
శాంతదుర్గ అన్న పేరు పురాణాలలో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు. శాంతముని అనే రుషికి దుర్గామాత దర్శనమిచ్చింది కాబట్టి ఆమెకు శాంతదుర్గ అన్న పేరు స్థిరపడినట్లు ఓ గాథ వినిపిస్తుంది. గోవాలోని జనబాహుళ్యంలో మాత్రం శాంతదుర్గ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి శివకేశవుల మధ్య ఘోర యుద్ధం తటస్థించిందట. ఆ సమయంలో ఏం చేయాలో తోచక ముల్లోకాలలూ తల్లడిల్లిపోయాయి. కానీ దుర్గాదేవి మాత్రం వారిరువురి యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపింది. ఒక చేత్తో విష్ణుమూర్తినీ, ఒక చేత్తో శివునీ పట్టుకుని వారిరువురి పోరునీ నిలిపింది. ఇదేదో ఈమధ్య ప్రచారంలోకి వచ్చిన కథ కాదు. దాదాపు 500 ఏళ్ల క్రితం శాంతిదుర్గ పేర ప్రతిష్టించిన మూర్తులలో కూడా శివకేశవులని శాంతింపచేస్తున్నట్లుగా కనిపించే శాంతదుర్గని గమనించవచ్చు.

గోవాకు ప్రత్యేకం
దుర్గాదేవిని శాంతదుర్గ రూపంలో కొలవడం ఒక్క గోవాలోనే ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక్కడ పుట్టలని కూడా శాంతదుర్గకి ప్రతిరూపంగా బావించి పూజించడాన్ని గమనించవచ్చు. ఒకప్పుడు గోవాలోని స్థానిక తెగలవారు సంతేరి అనే గ్రామదేవతను పుట్టరూపంలో కొలుచుకునేవారనీ, ఆమే క్రమేపీ శాంతదుర్గగా మారిందన్న విశ్లేషణలూ ఉన్నాయి. సంతేరి అయినా శాంతదుర్గ అయినా పేరు ఏదైతేనేం, గోవా ప్రజలు మాత్రం ఈ చల్లని తల్లిని నమ్ముకుంటే సకల శుభాలూ కలుగుతాయని భావిస్తారు.

కావెలెం ఆలయం
గోవాలో శాంతిదుర్గ పేరుతో చాలా ఆలయాలే ఉన్నా కావెలెం గ్రామంలోని ఆలయం మాత్రం అత్యంత ప్రముఖమైంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు తొలుత కొలోసిం అనే గ్రామంలో ఉండేది. అయితే 1566లో గోవాని ఆక్రమించుకున్న పోర్చుగీసువారు కొలోసింలోని ఆలయాన్ని కూల్చివేయడంతో, అక్కడి మూలవిరాట్టుని కావెలెంకు తరలించారు. అలా కావెలెంలో ఆలయాన్ని నిర్మించి ఇప్పటికి 450 ఏళ్లు పూర్తయ్యాయి. చూసేందుకు అచ్చు ఐరోపా వాసుల భవంతిలా తోచడం ఈ ఆలయానికి ఉన్న విశేషం.

కావెలెంలోని శాంతదుర్గను గోవాలని అనేక కుటుంబాలు తమ ఇలవేల్పుగా పూజించుకుంటున్నాయి. వారి క్షేమసమాచారాలను గమనించుకునేందుకు కావేలంలో ఒక సంస్థానాన్ని కూడా ఏర్పాటుచేశారు. గోవా రాజధాని పనాజీ నుంచి కేవలం 33 కిలోమీటర్ల దూరంలో అందమైన ప్రకృతి మధ్య ఉన్న కావేలం అమ్మవారిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news