మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాలుః
నాన్యం జానే నైవ జానే న జానే.
సీతారాముల గురించి తెలియన భారతీయులు ఉండరు. రాముల వారి గుడి లేని ఊరూ ఉండదు అంటే అతిశయోక్తికాదేమో! ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి మనకు శ్రీరామనవమి. వాడవాడలా సీతారాముల కళ్యాణం చేస్తారు. వడపప్పు, పానకం, చిత్రాన్నం ప్రసాదంతో ఆనందంగా అందరూ తరిస్తారు.
శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు…
శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో శ్రీరాముని ఏడోది. రాముడు కోసల దేశాధీశుడైన దశరథునకు కౌసల్యా గర్భాన చైత్రశుద్ధ నవమినాడు, పునర్వసు నక్షత్రం నాలుగోపాదాన, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు. ఈ రోజునే ప్రతి సంవత్సరం శ్రీరామనవమిగా జరుపుకొంటారు.
మూడురోజుల పండుగ
అగస్త్య సంహితలో ఇది మూడు రోజుల పండుగ. అష్టమి గురుపూజ, నవమి ప్రతిమా కల్పన, దశిమిన ప్రతిమాదానం చేస్తారు. నవమినాడు ఉపవాసం, రాత్రి పురాణ శ్రవణాదులచే జాగరణం చేస్తారు.శ్రీరామ పూజకు పునర్వసు నక్షత్రంతో కూడిన చైత్ర శుద్ధ నవమి చాలా ప్రాశస్త్యం. అష్టమితో కూడిన నవమిని రామపూజకు విష్ణుభక్తులు ఎప్పుడు చేకొనకూడదని అగస్త్య సంహిత పేర్కొంది. అందుచేతనే మిగులు నవమినాడు వైష్ణవ భక్తులు శ్రీరామనవమిని జరుపుకొంటారు. శ్రీరామనవమి కార్యక్రమాలు అభిజిత్‌లగ్నంలో చేస్తారు.
సీతారాముల కళ్యాణం రామనవమి నాడేనా?
నిజానికి దేశంలో ఏ ఇతర ప్రాంతాల్లో శ్రీరామనవమినాడు సీతారాముల కళ్యాణం చేయరు. కేవలం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కేవలం తెలుగునాట మాత్రమే ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తుంది. దీనికి ప్రధాన కారణం వసంతనవరాత్రులు చేసి చివరగా రామకళ్యాణం నిర్వహించడం అనవాయితీ అది కాస్తా వాడవాడలా రాములోరి కళ్యాణంగా మారింది. ఈ రోజున కళ్యాణం చేయకూడదని ఏం లేదు, ఇదొక ప్రాంతీయ ఆచారం. శుభ సమయాన లోకరక్షకుడి కళ్యాణం చేసుకోవడం మంచిదేనని పెద్దలు అంటారు.
పానకం స్పెషల్
శ్రీరామనవమికి మిరియాల పొడి వేసిన బెల్లపు పానకం విరివిగా సేవిస్తారు. తెలుగు ప్రజలకు ఇది ఒక ఆచారంగా భావిస్తారు. ఈ పండుగనాటికి అంటే చైత్రమాసం ప్రారంభమై వడగాల్పులు వచ్చే సమయం ఇది. ఈ సమయంలో బెల్లం పానకం సేవిస్తే తాపశనమం జరుగుతుంది. భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి దీన్ని మన పూర్వీకులు ఆచారంగా మార్చారు. మిరియాలపొడి, బెల్లం పానకం వల్ల శరీరంలో తాపం తగ్గుతుంది.