ఏ దేశ ప్రధాని మోదీ చేసినట్లు చేయలేదని, ఆయన దేశాన్నంతటినీ ఏకం చేశాడని.. మోదీ యునైటెడ్ ఇండియా లైక్ నో పీఎం ఇన్ డికేడ్.. పేరిట టైమ్ మ్యాగజైన్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది.
మన దేశంలో ఏ ఎన్నికలు అయినా సరే.. గెలిచిన పార్టీకే అందరూ దాసోహం అంటారు. ఆ పార్టీకి చెందిన నేతలను ధీరుడు, శూరుడు.. అంటూ పొగుడుతారు. ఆఖరికి మీడియా సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా రాజకీయ పార్టీలు అధికారంలోకి లేకపోతే ఒకలా, అధికారంలో ఉంటే మరొకలా మాట్లాడుతుంటారు. తమ తమ పత్రికలు, చానళ్లలో ఆ మేరకు కథనాలను ప్రసారం చేస్తుంటారు. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ కూడా ఇదే చేసింది. ఎన్నికలకు ముందు మోదీని తిట్టిపోసింది. కానీ ఇప్పుడు మోదీ గొప్ప వ్యక్తి అంటూ.. కథనాలను వండి వడ్డించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ప్రముఖ టైమ్ మ్యాగజైన్ లో వచ్చే కథనాలు కచితత్వంతో, నిజాయితీతో ఉంటాయని మంచి పేరుంది. అయితే ఈ మ్యాగజైన్ మోదీపై రెండు భిన్నమైన కథనాలను ప్రచురించింది. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని భారత ప్రధాన విభజనదారు అని టైమ్ తన కథనంలో రాసింది. అయితే అదే మ్యాగజైన్.. ఎన్నికలై మోదీ మళ్లీ ప్రధానిగా గెలిచాక.. మోదీ విభజనవాది కాదు.. సమైక్య వాది అని రాసింది.
ఏ దేశ ప్రధాని మోదీ చేసినట్లు చేయలేదని, ఆయన దేశాన్నంతటినీ ఏకం చేశాడని.. మోదీ యునైటెడ్ ఇండియా లైక్ నో పీఎం ఇన్ డికేడ్.. పేరిట టైమ్ మ్యాగజైన్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 303 సాధించిన నేపథ్యంలో మోదీని పొగుడుతూ టైమ్ మ్యాగజైన్ కథనం రాసింది. గత 5 సంవత్సరాల కాలంలో మోదీ తీసుకున్న నిర్ణయాలు, ఆయన అనుసరించిన విధానాల పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ భారతీయ ఓటర్లను ఆయన ఏకతాటిపైకి తీసుకొచ్చారని ఆ కథనంలో రాసుకొచ్చారు. అలాగే గత 7 దశాబ్దాల్లో ఏ ప్రధాని మోదీలా పనిచేయలేదని ఆ కథనంలో రాశారు.
అయితే టైమ్ మ్యాగజైన్ మోదీని ఒకసారి తిట్టి, మరొకసారి పొగుడుతూ కథనాలను ప్రచురించే సరికి బీజేపీ నేతలు ఆ మ్యాగజైన్‌ను తిట్టిపోస్తున్నారు. టైమ్ మ్యాగజైన్ రెండు నాల్కల ధోరణని అవలంబిస్తోందని, వివక్ష పూరిత వ్యాఖ్యలతో కథనాలను రాస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్నికలకు ముందు మోదీని తిట్టి, తరువాత మోదీ ప్రధాని అయ్యే సరికి ఆయన్ను పొగుడుతూ మరొక కథనం రాయడం.. వివక్షాపూరితమైన చర్యేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అవును మరి.. అలా వ్యవహరించకపోతే ఏ సంస్థకైనా తిప్పలు తప్పవు కదా.. అది ఆఖరికి మీడియా అయినా సరే.. అధికార పక్షానికి పాజిటివ్‌గానే ఉండాలి.. ఉండి తీరాల్సిందంతే..!