ఏపీలో ఆర్టీసీ చైర్మన్, ఏపీఐఐసీ చైర్ పర్సన్, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ పదవుల్లో వేటినైనా రోజా, అంబటిలకు ఇవ్వవచ్చని తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పాలనలో, ప్రజా సంక్షేమ పథకాల అమలులో తనదైన మార్కును చూపిస్తూ ముందుకు సాగుతుండగా.. జగన్ పాలనను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక మరో వైపు తాజాగా జగన్ తన మంత్రవర్గ కూర్పును కూడా చక్కగా చేశారని, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిని సమానంగా చూస్తూ మంత్రి పదవులు ఇచ్చారని జగన్‌ను మెచ్చుకుంటున్నారు. అయితే మరోవైపు.. కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించిన సీనియర్ నేతలు అంబటి రాంబాబు, రోజాలకు జగన్ మంత్రి పదవులు ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పు బడుతున్నారు.
అంబటి రాంబాబు, రోజాలు టీడీపీ హయాంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో ముఖ్య నేతలుగా ఉన్నారు. రోజా అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్‌గా వ్యవహరించి వైసీపీకి అండగా ఉన్నారు. ఇక అంబటి రాంబాబు తన వాగ్దాటితో టీడీపీ నేతలకు ఎప్పటికప్పుడు చురకలు అంటిస్తూ వచ్చి మంచి వక్తగా, నేతగా పేరు తెచ్చుకున్నారు. నిజానికి వైసీపీలో ఈ ఇద్దరు నేతలు చాలా కీలకమనే చెప్పవచ్చు. అయినప్పటికీ ఈ ఇద్దరికీ ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో వైసీపీ కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అయితే రోజా, అంబటిలకు మరో రెండున్నర సంవత్సరాల తరువాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో చాన్స్ ఇస్తారని ప్రచారం జరుగతున్నా.. అప్పటి వరకు జగన్ వారిని అసంతృప్తితో ఉంచుతారా..? అన్న సందేహం వస్తోంది. మరైతే జగన్ వారికి మంత్రి పదవి కాకుండా కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఇస్తారా..? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అయితే రెండున్నర ఏళ్ల వరకు ఆగడం ఎందుకని చెప్పి.. జగన్ వారికి అత్యంత ప్రాధాన్యం ఉన్న నామినేటెడ్ పోస్టులను ఇవ్వవచ్చనే తెలుస్తోంది.
ఏపీలో ఆర్టీసీ చైర్మన్, ఏపీఐఐసీ చైర్ పర్సన్, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ పదవుల్లో వేటినైనా రోజా, అంబటిలకు ఇవ్వవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ పదవులతోపాటు వారికి కేబినెట్ హోదా కూడా వస్తుంది. దీంతో వారిని కొంత వరకు సంతృప్తి పరచవచ్చని కూడా జగన్ భావిస్తున్నారట. అలాగే మరికొందరు వైసీపీ నేతలైన ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వంటి వారికి కూడా కీలకమైన నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని జగన్ చూస్తున్నారట. మరి.. ఆ పోస్టులు ఎవరికి దక్కుతాయో.. వేచి చూస్తే తెలుస్తుంది..!