ఎడిట్ నోట్: గద్దె దించుతా..!

-

ఎన్నికలు ఎప్పుడు జరిగినా… తెలంగాణలో అధికారం బీజేపీదే అని, ఖచ్చితంగా కేసీఆర్‌ని గద్దె దించి…తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు..ఇదే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. ముఖ్యంగా బండి సంజయ్…కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా బీజేపీ బాధ్యతలని భుజాన వేసుకుని దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఇక కేంద్రంలోని పెద్దలు సైతం తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టి..కేసీఆర్‌ని గద్దె దించాలని చూస్తున్నారు. ఇది బీజేపీ వర్షన్.

ఇక కేసీఆర్ వర్షన్ వచ్చేసరికి…మళ్ళీ తెలంగాణలో మూడో సారి అధికారంలోకి రావడమే కాదు..ఈసారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి..కేంద్రంలో మోదీ సర్కార్‌ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వేదిక ఏది అయినా కేసీఆర్ టార్గెట్ బీజేపీ మాత్రమే. అటు కాంగ్రెస్ సైతం..తెలంగాణలో కేసీఆర్‌ని గద్దె దించి…బీజేపీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇలా ఎవరికి వారే గద్దె దించే పనిలో ఉన్నారు. అదే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు.

తాజాగా అసెంబ్లీ సమావేశాల వేదికగా కేసీఆర్..బీజేపీనే టార్గెట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని, ఇంకా మిగిలింది 17-18 నెలల సమయం మాత్రమేనని, వారిని దేవుడు కూడా కాపాడడని అన్నారు. మహాత్ముడు పుట్టిన నేలపై మరుగుజ్జుల్లా, దరిద్రుల్లా బీజేపీ నేతలు దాపురించారని ధ్వజమెత్తారు. అలాగే ఎప్పటిలాగానే మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం డిమాండ్ చేస్తుందని కేసీఆర్ విమర్శించారు. ఇలా పూర్తి స్థాయిలో కేసీఆర్…బీజేపీనే టార్గెట్ చేశారు.

ఇదే సమయంలో కేసీఆర్‌కు బీజేపీ నేతలు గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విషయంపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధం చెప్పారని, ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధమని తాను నిరూపిస్తానని.. సిగ్గు, లజ్జ ఉంటే ఆయన రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ అన్నది గడచిన పదేళ్లలో అతిపెద్ద జోక్‌ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక సరిగ్గా ఏడాదిలో కేసీఆర్‌ని గద్దె దించేస్తామని బండి పదే పదే సవాల్ చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ వర్షన్ వచ్చేసరికి..కేసీఆర్‌ని ఓడించడమే కాదు…బీజేపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అలాగే అధికారంలోకి రాగానే…TRS పార్టీకి అనుకూలంగా ఉన్న TS అనే రిజిస్ట్రేషన్ తొలగించి…TG గా మారుస్తామని రేవంత్ అంటున్నారు. అలాగే కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ముఖ కవళికలున్న టీఆర్‌ఎస్‌ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము ఆమోదించబోమని, ఆ విగ్రహాన్ని తిరస్కరిస్తూ.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నారు.

కాంగ్రెస్ వచ్చిన తరువాత అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణను అధికార గీతంగా చేస్తామని, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక జెండాని రూపొందిస్తామని అంటున్నారు. ఇలా ఎవరికి వారు అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. మరి ఎవరు ఎవరిని గద్దె దించుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news