ఎడిటర్ నోట్ : అంతా శివుడే ! శక్తినివ్వూ !

పెద్ద‌గా కోరిక‌లు కోరుకోకండి.చుట్టూ ఉన్న‌వారి ఉన్న‌తి కోరుకుంటే మీరు బాగున్నట్లే! బాగుప‌డ‌డం  చెడిపోవ‌డం అన్న‌వి మీతోనే ! భారం దేవుడిపై కాదు భారం అన్న‌ది మీపై మీరు వేసుకుంటూనే ఉంటూ నిత్యం స‌త‌మ‌తం అవుతుండ‌డమే ఆధునిక జీవితం. క‌నుక శివ‌య్య ఆరాధ‌న‌లో భార ర‌హిత స్థితి పొంద‌డం సాధ్యం. ఒత్తిడిని దూరం చేసే ధ్యానం.. ఉల్లాసంగా ఉంచే స్మర‌ణం, బుద్ధి వికాసం క‌లిగించే ప్ర‌వ‌చ‌నం అన్నీ అన్నీ శివ‌య్య ఆరాధ‌న‌తోనే సాధ్యం.

ఈ శివ‌రాత్రి వేడుక‌లు ఆనందాల‌నే కాదు భార‌తీయ సంస్కృతిని కాపాడేందుకు కూడా ఎంత‌గానో స‌హ‌క‌రించాలి. త‌ప్పుడు ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స‌హ‌క‌రించాలి. పండుగ నుంచి ఏం కోరుకోవాలి అంటే ఇత‌రుల ఆనందాల‌కు జీవితంలో ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క క్ష‌ణ‌మ‌యినా కార‌ణం అయితే చాలు అని! అదే శివ‌య్య‌కు మ‌నం ఇచ్చే కానుక‌. మ‌న‌వి చేయ‌ద‌గ్గ విష‌యం.మ‌న‌ది అని అనుకోద‌గ్గ నైజం కూడా ఇదే!

జీవితాన్ని విస్తృతం చేయ‌గల స‌మ‌ర్థ‌త మ‌నిషికి ఉందా? ఆయువు పెంచుకుంటే జీవితం విస్తృతం అయిపోతుందా? ఆయువుతో పాటు ఆనంద రేఖ‌లు మ‌రింత విస్తృతం కావాలంటే ఏం చేయాలి? ఇవి క‌దా కావాలి.ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దుల‌న్న‌ది లేదు. శివ‌య్యే అంతా అని భారం వేసి ప్ర‌యాణించ‌డం త‌ప్ప‌! ఇప్పుడు ఉన్న కాలంలో మ‌నం ఏం సాధించాం అన్న ప్ర‌శ్న‌కే జ‌వాబు లేదు.దేశాలు యుద్ధాల పేరిట కొట్టుకుంటున్నాయి. సంఘాలు లేదా స‌మూహాలు వ‌ర్గాల పేరిట కొట్టుకుంటున్నాయి.

ప్రాంతాలు వేర్పాటు పేరిట త‌మ వాదాలు వినిపిస్తూ నెగ్గుకు రావాల‌ని చూస్తున్నాయి.ఇవ‌న్నీ మ‌నిషి ని మ‌నిషి ప్ర‌శ్నించే సంద‌ర్భాలే లేదా నిలువ‌రించే వైనాలే! అందుకే ఆధునిక యుద్ధంలో మ‌నిషికి అలుపెరుగ‌ని సంద‌ర్భాలే ఎక్కువ. కాలంతో చేసే యుద్ధంలో బ‌డ‌లిక కు ప్రాధాన్యం అన్న‌ది లేనేలేదు.ఇంత‌టి అచేత‌న‌లో శ‌క్తి ఇచ్చేవాడెవ్వ‌డు. న‌డిపే వాడెవ్వ‌డు. శ‌క్తి ఇచ్చి ప‌ది కాలాల పాటు నైరాశ్యం అన్న‌ది అంటకుండా ఉండేలా చేసేవాడెవ్వ‌డు?

దేశాల అధ్య‌క్షులు  కొట్టుకుంటుంటే ప్ర‌జ‌లు ఏం చేయ‌గ‌ల‌రు? ఆయుధాలు అందుకుని యుద్ధం చేసినా ఫ‌లితం ఎలా ఉంటుంది. సుంద‌ర న‌గరాలు, వాటి ఆనందాలు అన్నీ అన్నీ ఇవాళ లేవు.ఇక‌పై రావు కూడా! అందుకు ఉక్రెయిన్ ఓ ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే! శివ‌త‌త్వంలో  ల‌యం చేసుకోవ‌డం ఒక్క‌టే కాదు నిర్మాణం అన్న‌ది కూడా అత్యంత ప్రాధాన్యాన్ని సంత‌రించుకునే దృగ్విష‌యం.

దుఃఖాన్నీ దురాశ‌నూ న‌శింప‌జేసే త‌త్వం శివ‌య్య‌లోనే ఉంది.అందువ‌ల్ల జ‌న్మ దుఃఖ వినాశ‌నకారి ఎవ్వ‌రు శివుడే! మ‌న‌జీవితాల్లో ఆరాధ‌నీయత‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అంత్య కాలాల్లో ఉండే మ‌ర‌ణ భ‌యాలు తొల‌గిపోవాలి.అంటే అందుకు కూడా శివ‌య్య ఒక్క‌డే స‌రితూగ‌గల దేవ‌దేవుడు.ఆయ‌న స్మ‌ర‌ణ‌లో మీరు ఇవాళ ఉండండి..మీ జీవిత కాలాన్నీ వెచ్చించండి.శివోహం.