‘రవిప్రకాశ’ మోక్షానికి కదిలిన చంద్రుడు..!

మీడియా నయీంగా పిలువబడుతున్న టివి9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌ను కాపాడటానికి స్వయంగా బాబే దిగివచ్చాడు. తన అనుంగు సహచరుడు, పబ్లిక్‌ మైక్‌, తన తరపున ఎంతో ప్రచారం చేసిపెట్టినవాడు, తుదకు ఆపదలో ఉన్నాడని తలచిన చంద్రబాబు హుటాహుటిన రాజగురువు చెంతకు చేరాడు. రవికి ఎలా మోక్షాన్ని ప్రసాదించాలో తెలియజేయమని వేడుకున్నాడట.

సిరికింజెప్పడుశంఖచక్రయుగముంజేదోయిసంధింపడే
పరివారంబునుజీరడభ్రగపతింమన్నింపడాకర్ణికాం
తరధమ్మిల్లముచక్కనొత్తడువివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైనవీడడుగజప్రాణావనోత్సాహియై

ఇది మహాకవి బమ్మెర పోతనామాత్యులు రచించిన మహాభాగవతంలోని గజేంద్ర మోక్షం తాలూకు పద్యం. ప్రస్తుతం ఈ గజేంద్రమోక్షమనే నాటకం చంద్రబాబు దర్శకత్వాన కడు రమ్యంగా నడుస్తోంది. పీకలదాకా మునిగిపోయిన భక్తుడిని ఎలా రక్షించాలో తెలియక, తటాలున రామోజీ ఫిల్మ్‌ సిటీలో వాలాడు.

Finally Chandrababu involved to save ravi prakash from his cases

ఇంకోపక్క, తెలంగాణ పోలీసులు ఫోర్జరీ, మోసం, నిధుల మళ్లింపు తదితర ఆరోపణలపై పక్కా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు. తప్పుడు ధృవపత్రాలు, నటుడు శివాజీకి 40వేల షేర్లు అమ్మినట్లుగా సృష్టించిన దొంగపత్రాలకు సంబంధించి ఈమెయిల్‌ సమాచారాన్ని సంపాదించారు. వీటిని వాళ్లు డిలీట్‌ చేయగా, ఇటువంటి వాటిలో ఆరితేరిన తెలంగాణ సైబర్‌క్రైమ్‌ పోలీసులు మొత్తం మెయిల్‌ డాటానంతా చాలా సులభంగా తిరిగి రికవరీ చేసారు. దాంతో రవిప్రకాశ్‌ అండ్‌ కంపెనీ చేసిన దొంగ వ్యవహారాలన్నీ బయడపడ్డాయి. మరోపక్క, హైకోర్టు కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. పోలీసులు పలుమార్లు పంపిన నోటీసులకు జవాబివ్వకుండా, హాజరు కాకుండా ఉండి, ఇంకాస్తా చేటు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అరెస్టు తప్పనిసరి అయింది. ఇటువంటి పరిస్థితుల్లోనే రవిప్రకాశ్‌ చంద్రబాబు శరణుజొచ్చాడు. సరే.. ఎంత కాదనుకున్నా, మనకు సహాయం చేసినవాడు, పైగా ‘మన’వాడు, ఇప్పుడు కూడా ‘ఐన్యూస్‌’ను కొని ఇంకో తెలుగు టీవీ ఓనర్‌ అయ్యాడు కాబట్టి, కాపాడక తప్పేట్టులేదనుకున్న బాబుగారు రవిప్రకాశమోక్షానికి ఉపక్రమించారు.

ఇక, రాజగురువు రామోజీరావు గారు, కథను ఎలా మలుపుతిప్పాలో బాగా తెలిసిన వారు కావడం, విషయమంతా తెలంగాణలో ఉండటం చంద్రబాబుకు కొంతలోకొంత సులువయింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని శాంతింపజేయడం, తన ద్వారా, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన టివి9 కొత్త ఓనర్‌ మైహోమ్‌ రామేశర్వరావు గారిని మేనేజ్‌ చేసి, ఇష్యూ ఇంకా పెద్దదికాకుండా చూడటం, అరెస్టుల దాకా వెళ్లకుండా నిరోధించడం.. ఇవన్నీ ఇప్పుడు రామోజీరావుగారి భుజస్కంధాలపై ఉన్నాయి. పేరుకు మామూలు కలయికగా కనబడినా, నిన్నటి మీటింగ్‌కు నిజానికి కేసీఆర్‌ కూడా రావాల్సిఉండెనని, అందుకే చంద్రబాబు అంత హడావుడిగా చాపరేసుకుని నేరుగా ఆర్‌ఎఫ్‌సీలోనే దిగిపోయాడని మీడియాలో ఒకవర్గం గుసగుసలు. కారణమేదైనా కేసీఆర్‌ రాకపోవడంతో మీటింగ్‌ పరమార్థం బెడిసికొట్టిందనే అనుకోవాలి.

ఈ గురుతర బాధ్యతను రామోజీరావు ఎలా నిర్వహిస్తారనేదే ఇక్కడ మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. కేసీఆర్‌ను ఒప్పించడం అంత సులభం కాదు. ప్రత్యేకించి, రవిప్రకాశ్‌ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చాలా క్లియర్‌గా ఉన్నారు. ఒకప్పుడు విర్రవీగి కూసిన కూతలు, వేసిన బొమ్మలు అన్ని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశముంది. తప్పులేదు. మెరుగైన సమాజం కోసం తప్పదు కూడా.

ఇప్పుడు రవిప్రకాశ్‌కు కావాల్సింది అరెస్టుకాకుండా ఉండటం. అరెస్టయితే చూడాలనీ, పండుగ చేసుకోవాలని ఓవైపు ప్రధాన మీడియా, సోషల్‌ మీడియా చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. ఒకవేళ అరెస్టయితే, తన పరువు-ప్రతిష్టలు, ఇప్పటిదాకా ఉన్న పేరు(?) చెడిపోద్దని, తన కొత్త వెంచర్లయిన భారత్‌వర్ష్‌, ఐన్యూస్‌లకు చెప్పుకోదగ్గ గౌరవం దక్కదనే బాధ ఆయనను అంతటా పరుగులు పెట్టిస్తోంది. ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నాడనే పేరు మాత్రం దక్కింది.హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు కూడా చేసాడు కానీ, అది 22న విచారణకు వస్తుంది. ఇప్పటికే డేగకళ్లతో వెతుకుతున్న తెలంగాణ పోలీసులకు చిక్కితే మాత్రం ఏమీ ఉండదు.

ఇక శివాజీ అనబడే కేతిగాడు, మొన్నీమధ్యే ఒక విడియో విడుదల చేసి, పతివ్రతాకథాకాలక్షేపం చేసాడు. కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రచారం చేసివచ్చాడట. ఈయనగారు ఎక్కడ, ఎవరికి తెలుసో, ఎవరికీ అర్థం కాలేదు. శివాజీ అంటే నిప్పు, పప్పు అంటూ సొల్లు కబుర్లు చెప్పి, పొంతన లేకుండా వంతపాటలు పాడాడు. దీనికి బదులు, అదే పోలీసుల వద్దకు వెళ్లి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా. కాస్త గౌరవమైనా మిగిలేది. ఈ ఆరోవేలుతో ఎవరికీ ప్రయోజనం లేదు, నష్టం తప్ప. చంద్రబాబుకు కూడా.

చంద్రబాబుగారి ప్రయాణం, రాజగురువు గారి ప్రయత్నం ఫలించి, కేసీఆర్‌ మెత్తబడితే.. ఇంకేముంది? ఈ మీడియా నయీం కథ రియల్‌ నయీం కంచికి చేరుతుంది. అన్నట్లు ఎంత పెద్ద కేసునైనా కంచికి చేర్చడంలోనూ తెలంగాణ పెద్దలు ఆరితేరినవారే కదా! కాబట్టి, ఈ కేసులోనూ మరీ సంచలనాల కోసం ఎదురుచూడటం అత్యాశే అవుతుందని చాలామంది అనుభవజ్ఞుల అభిప్రాయం.

-రుద్రప్రతాప్‌