ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్‌పై న్యూజిలాండ్ గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన పటిమను కనబరిచిన కివీస్ మొదటి టెస్టు చాంపియన్ షిప్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. అయితే భారత్ మాత్రం తీవ్రమైన నిరాశలో ఉంది. బౌలర్లు బాగానే రాణించినా బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం చెందడంతోనే మ్యాచ్ ఓడిపోయామనే సంగతి తెలిసిందే. దీంతో మరోసారి కోహ్లి కెప్టెన్సీపై అనుమానాలు నెలకొన్నాయి.
నిజానికి ఇప్పుడు కాదు, గత ఐసీసీ టోర్నమెంట్‌లలోనూ కోహ్లి నేతృత్వంలో భారత్ రాణించలేదు. 2017లో పాకిస్థాన్ తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓటమి, 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో ఓటమి, తరువాత ఇప్పుడు అదే జట్టుతో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమితో కోహ్లి అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ధోనీ నాయకత్వంలో భారత్ ఆడిన 4 ఐసీసీ ఈవెంట్లలో 3 గెలిచింది. కానీ కోహ్లి కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు. దీంతో కోహ్లి నాయకత్వాన్ని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. వనరులను ఉపయోగించుకోవడంలో కోహ్లి విఫలం అయ్యాడని ఆరోపిస్తున్నారు.
నిజానికి కోహ్లి అంత చెత్త కెప్టెన్ ఏమీ కాదు. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌ను అగ్ర పథాన నిలిపాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి జట్లను ఆ దేశాల సొంత మైదానాల్లోనే ఓడించి అనేక సిరీస్‌లను గెలిపించాడు. ఒక్క సౌతాఫ్రికా తప్ప దాదాపుగా అన్ని దేశాలపై కోహ్లి నాయకత్వంలో భారత్ గెలిచింది. కానీ ఐసీసీ టోర్నీల విషయానికి వస్తే కోహ్లి కెప్టెన్‌గా విఫలం అవుతున్నాడు. మరి త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో అయినా భారత్‌ను నంబర్ వన్ స్థానంలో నిలుపుతాడా, లేదంటే మళ్లీ ఫెయిలవుతాడా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.