వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో ఇక‌పై 14 టీమ్‌లు పోటీ.. ప్ర‌తి 2 ఏళ్లకు ఒక‌సారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌..

వ‌ర‌ల్డ్ క‌ప్‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో ఐసీసీ కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై నిర్వ‌హించ‌నున్న వ‌న్డే వర‌ల్డ్ క‌ప్‌ల‌లో 14 టీమ్‌లు పోటీ ప‌డుతాయ‌ని, ప్ర‌తి 2 ఏళ్ల‌కు ఒకసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ఈ మేర‌కు ఐసీసీ గ‌వ‌ర్నింగ్ బాడీ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 2027 ఎడిష‌న్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి 14 టీమ్‌ల‌ను ఆడించ‌నున్న‌ట్లు తెలిపింది.

2027, 2031ల‌లో నిర్వ‌హించ‌నున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో 14 టీమ్‌లు పాల్గొంటాయి. 54 మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు. 2024, 2026, 2028, 2030ల‌లో నిర్వ‌హించనున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో 20 టీమ్‌లు పాల్గొంటాయి. 55 మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు. గ‌తంలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో 10 టీమ్‌లు పాల్గొనేందుకు మాత్ర‌మే అవ‌కాశం ఉండ‌గా, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో 16 టీమ్‌లు పాల్గొనేందుకు అవ‌కాశం ఇచ్చారు. కానీ భ‌విష్య‌త్తు టోర్నీల‌లో పాల్గొనే టీమ్‌ల సంఖ్య పైన చెప్పిన విధంగా పెర‌గ‌నుంది.

8 టీమ్‌లు పాల్గొనే చాంపియ‌న్స్ ట్రోఫీ టోర్నీల‌ను 2025, 2029ల‌లో నిర్వ‌హిస్తారు. 2025, 2027, 2029, 2031ల‌లో ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్స్‌ను నిర్వ‌హిస్తారు. వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌ల‌లో రెండు గ్రూప్‌ల‌లో 7 టీమ్‌ల చొప్పున ఆడిస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి 3 టీమ్‌లు మొత్తం 6 టీమ్‌లు సూప‌ర్ సిక్స్ ద‌శ‌కు చేరుకుంటాయి. త‌రువాత సెమీ ఫైన‌ల్స్‌, ఫైన‌ల్స్ నిర్వ‌హిస్తారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లో 4 గ్రూప్‌లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో 5 టీమ్‌లు ఉంటాయి. 4 గ్రూప్‌ల నుంచి గ్రూప్‌కు 2 టీమ్‌ల చొప్పున మొత్తం 8 టీమ్‌లు సూప‌ర్ 8 ఆడుతాయి. త‌రువాత సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్‌లు ఉంటాయి. చాంపియ‌న్స్ ట్రోఫీ టోర్నీల‌లో రెండు గ్రూప్‌లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో 4 టీమ్‌లు ఆడుతాయి. త‌రువాత సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు.