హ్యాపీ గాళ్ చైల్డ్ డే : విశ్వ వీధుల్లో ఉన్న తార‌లకు..!

-

తార‌లు మాట్లాడ‌డం ఆనందం
న‌వ్వులు ప‌ర‌మావ‌ధి
ఆ న‌వ్వుల చెంత ఉండ‌డ‌మే పండుగ

గెలిచిన ప్ర‌తిసారీ అమ్మాయిలు మ‌నంద‌రి క‌న్నా గ‌ర్వంగా ఉంటారు.అమ్మాయిలను గెలిపించిన ప్ర‌తిసారీ నాన్న‌లు మ‌నంద‌రి క‌న్నా బాధ్య‌త‌గా ఉంటారు. అమ్మాయిల వెలుగులు ఈ దేశానికి కావాలి అని రాసిన ప్ర‌తిసారీ ఓ గొప్ప నినాదం అయి ఉంటుంది ఈ మాట.. ఆ వెలుగును ప్రేమిస్తూ ఉద‌యాల‌ను స్వాగ‌తిస్తూ పోతూ  ఉంటే మంచి అన్నది కొంత కాదు ఎంతో నిలిచి ఉంటుంది మ‌న‌లో! బిడ్డ‌లంతా సంస్కృతిని ప్రేమించాలి.పెరిగే సంస్కృతిలో దేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో అన్న‌ది ఓ ప్రాముఖ్యం కావాలి. ప్రాధాన్యం అయి ఉండాలి కూడా! ఆడ‌బిడ్డ‌ల కోసం వారి విజ‌యాల కోసం ప‌రిత‌పించే వారు ఇప్ప‌టికీ ఉన్నారు..ఎప్ప‌టికీ ఉంటారు..వారు సాంస్కృతిక వారధులు మాత్ర‌మే కాదు గెలుపున‌కు సార‌థ్యం వ‌హించేవారు కూడా!

కాస్త‌యినా గెలుపునకు సంబంధించి మాట‌లు ఇవాళ రాయాలి. జాతీయ బాలిక‌ల దినోత్స‌వం.మీరు చ‌ద‌వండి మీరు చ‌దివిస్తాం అని చెప్పే త‌ల్లిదండ్రుల‌కు ఇంకొంత గౌర‌వం ఇవ్వాలి.ఆడ బిడ్డ‌ల విష‌య‌మై త‌మ నిజాయితీనీ, త‌మ గౌర‌వాన్నీ పెంచుకునే త‌ల్లిదండ్రుల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ కృత‌జ్ఞ‌త‌లు చెల్లించాలి.చ‌దువుల్లో, ఆట పాట‌ల్లో ముఖ్యంగా వెలుగు పండుగ‌ల్లో ఎదిగే బిడ్డ‌ల‌ను ప్రేమ పూర్వ‌కంగా చూసుకోవాలి.బిడ్డ‌లంటే అపురూపం అయి ఉన్న జీవితాల‌కు సంకేతాలు క‌దా!క‌నుక బిడ్డ‌లంతా ఆనందం మ‌రియు ఆరోగ్యం అనే రెండు గొప్ప  విష‌యాల‌ను ఎల్ల‌వేళలా త‌మ వెంటే ఉంచుకోవాలి.ఆరోగ్య దాయ‌క స‌మాజంలో బిడ్డ‌లంతా పొందే ఆనందాలే ఇవాళ దేశానికి అవ‌స‌రం.అమ్మాయిలూ మీరు చ‌దువుకోండి..అబ్బాయిలూ మీరు వారితో పోటీ ప‌డండి.. ఈ రెండే ఇవాళ ప్ర‌ధానం అయి ఉండాలి.ఉన్నాయి కూడా!

ముఖ్య‌మ‌యినవ‌న్నీ మిస్సింగ్ మిస్సింగ్.ఆట‌లూ పాట‌లూ వీటితో పాటూ ముఖ్య‌మైన‌వ‌న్నీ మిస్సింగ్..జీవితం మైన‌పు పూత‌లా ఉంది అని అనుకోవాలి.క‌రిగి పోతుంది క‌దా!అందుకే ఆ పూతలు క‌రిగి ఏదో ఒక ఇబ్బందిని తెర‌పైకి తెచ్చి ఉంచుతున్నాయి.ఆడ బిడ్డ‌ల ఎదుగుద‌ల లేదా వారి చ‌దువు అన్న‌వి ఇవాళ అంద‌రికీ కావాల్సిన  బాధ్య‌త‌లు. నిర్వ‌ర్తించాల్సిన బాధ్య‌త‌లు అని రాయాలి. ఉన్న‌చోట ఆగిపోవ‌డం లో అర్థం లేదు అని అంటారు క‌దా! క‌నుక వాళ్ల‌ను ఆ విధంగా ఆగిపోనివ్వ‌ని ప్ర‌యాణం ఒక‌టి ఎవ‌రో ఒక‌రు త‌ప్ప‌క చేయ‌నివ్వాలి.

స్వేచ్ఛ అన్న‌ది అవ‌స‌రం అయిన ప‌దం అనుకుంటే ఆ ప‌దం వెనుక ఉన్న నేప‌థ్యం ఒక‌టి త‌ప్ప‌క అర్థం చేసుకోవాలి.నేను గెలుస్తాను నేను ఆడ‌బిడ్డ‌ను.. నేను గెలిచి వ‌స్తాను నేను ఈ దేశం బిడ్డ‌ను అని చెప్పిన వాళ్లంతా నా ఇంటి దీపాలు..మ‌న ఇంటి దీపాలు.. ఆ దీప‌పు వెలుగుల్లో ఈ దేశం గ‌ర్వంగా త‌లెత్తుకుని ఉంది. క‌నుక దీపాల‌ను కాపాడుకోవ‌డం,వాటి వెలుతురును విస్తృతం చేయ‌డం అన్న‌వి ఓ పెద్ద బాధ్య‌త‌గా మారిపోవాలి. విశ్వ వీధుల్లో అమ్మాయిల గెలుపును ఆస్వాదిస్తూ ఉంటేనే అవి సాధ్యం.

Read more RELATED
Recommended to you

Latest news