టాలీవుడ్‌తో ఏపీకి వ‌స్తున్న రెవెన్యూ ఎంత‌..? తెలంగాణాకు ఫుల్‌.. ఏపీకి నిల్‌

388

టాలీవుడ్‌తో ఏపీకి వ‌స్తున్న రెవెన్యూ ఎంత ? ఈ ప్ర‌శ్న‌లోనే ఏదో తేడా క‌నిపిస్తుంద‌ని.. జ‌వాబు దొర‌క‌ని ప్ర‌శ్న ఎలా వేస్తార‌ని అనుకుంటున్నారా ? నిజ‌మే.. మీరు అనుకుంటున్న‌ది నిజ‌మే.. తెలుగుచిత్ర‌సీమ హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన త‌ర్వాత ఏపీకి ఆదాయం ఎలా వ‌స్తుంది..? రానే రాదు మ‌రి. ఏమైనా వ‌స్తే.. ఏపీలోని థియేట‌ర్ల‌లో తెగిన టికెట్ల రూపంలో కొద్దోగొప్పో ప‌న్ను వ‌స్తుంది అంతేమ‌రి. అయితే.. ఇక్క‌డ ఒక్క విష‌యాన్ని మాత్రం విశ్లేషించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

తెలుగు చిత్ర‌సీమ‌లో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. హీరో, హీరోయిన్ల‌, ద‌ర్శ‌కులు మొద‌లు.. లైట్ బాయ్ వ‌ర‌కు .. ఉపాధినిస్తుంది ఈ క‌ళామ‌త‌ల్లి. మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్‌లో తెలుగుచిత్ర‌సీమ స్థిర‌ప‌డ‌డం.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌స్థాయికి ఎద‌గ‌డం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం వంద‌ల కోట్ల‌తో సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ అస‌లు తెలుగు చిత్ర‌సీమ నుంచి ప్ర‌భుత్వాల‌కు ఏమేర‌కు ఆదాయం వ‌స్తుంద‌న్న‌ది కీల‌క అంశం. ఆదాయమంటే.. వివిధ ప‌న్నుల రూపంలో.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఏడాదికి సుమారు 150 నుంచి 250 సినిమాల వ‌ర‌కు తీస్తున్నారు.

ఇక ఇందులో భారీ బ‌డ్జెట్ సినిమాలు.. మీడియం.. లోబ‌డ్జెట్ సినిమాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం సాహోను సుమారు 350కోట్ల‌తో నిర్మించారంటే అర్థం చేసుకోవ‌చ్చు టాలీవుడ్ స‌త్తా ఏమిటో.. ఇదే స‌మ‌యంలో రెండుమూడు కోట్లు.. ప‌ది కోట్లు, 20 కోట్ల‌తో కూడా సినిమాలు తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ నుంచి తెలంగాణ ప్ర‌భుత్వానికి సుమారు నాలుగు నుంచి ఐదువేల కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తుంద‌నే టాక్ ఉంది. జీఎస్టీ అమ‌లులోకి రాక‌ముందే.. అంటే సుమారు 2500 కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తుంది. ఇక జీఎస్టీ వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉందో సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చు.

అంటే.. తెలంగాణ ప్ర‌భుత్వానికి టాలీవుడ్ నుంచి భారీ ఆదాయ‌మే వ‌స్తుంద‌న్న‌మాట‌. నిజానికి.. ఇండ‌స్ట్రీలో కీల‌క వ్య‌క్తులు అంటే నిర్మాత‌లు, డైరెక్టర్లు.. ఇత‌ర విభాగాల‌కు చెందిన‌వారంతా ఏపీ నుంచి వ‌చ్చిన వారే.. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో టాలీవుడ్ ఏపీకి త‌ర‌లిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల్లో కూడా ఈ చ‌ర్చ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కానీ.. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా టాలీవుడ్‌ను గుప్పిట ప‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌తో ఏపీకి రూపాయి కూడా రాద‌న్న‌ది స్ప‌ష్ట‌మే.

ఇకవేళ ఏపీలో కూడా ఇండ‌స్ట్రీ నిర్మాణం జరిగితే త‌ప్ప రూపాయి ఆదాయం కూడా ఉండ‌ద‌నే చెప్పొచ్చు. నిజానికి.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హయాంలో కూడా ఇండ‌స్ట్రీ నిర్మాణంపై పెద్ద‌గా దృష్టి పెట్టింది కూడా లేదు. కానీ.. ఆంధ్రుల ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌స్తోంది. ఏపీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌ని టాలీవుడ్‌ను తామెందుకు ఆద‌రించాల‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు చిక్కులు మొద‌లైన‌ట్టేమ‌రి.