భారతదేశ సాంకేతిక నైపుణ్యానికి ఆద్యుడు, శతసహస్ర యంత్ర యోధుడు, సకల ఉపకరణ వినియోగ వీరుడు…. చంద్రబాబునాయుడు…. నేడు ఈవీఎంల పట్ల కినుక వహించెనేం? భారత రాజ్యాంగాన్ని ఎడాపెడా దిద్దినవాడు, అదే రాజ్యాంగం నిలబెట్టిన ఈసీని నేడు తూలనాడెనేం? ఎటులా.. ఎటుల ఎటుల? నిశిరాత్రి ఓటింగ్‌తో నిద్ర కరువాయెనా? ఓటమి భయంతో ఒళ్లు వణుకుచుండెనా? కళ్లముందు కాలయముడు కనిపించుచుండెనా? చందురబాబు ‘చిందుల’బాబు ఎందుకయ్యాడు?
బెదిరింపులు, అదిరింపులు, చీదరింపులు.. ఓటమిని ధిక్కరించజాలవు.
ఎందుకింత అసహనం? ఎందుకింత గగుర్పాటు? ఎందుకింత కోపం?
చంద్రబాబునాయుడు పోలింగ్ తెల్లవారి సాయంత్రం నుండీ ఇవే లక్షణాలతో తిరుగాడుతున్నాడు. ఎవరిమీద ఈ కోపం? ఎవరిమీద ఈ కసి? ఈవీఎంల మీదనా. ఈసీ మీదనా? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను మొట్టమొదట సమర్థించినవాడు చంద్రబాబు. మనుషుల్ని నమ్మడం కంటే టెక్నాలజీని నమ్మడం బెటరని నమ్మినవాడు. 2014లో ఇవే ఈవీఎంల మీద గెలిచినవాడు, ఈరోజు అదే ఈవీఎంలు వద్దంటే వద్దంటున్నాడు. బ్యాలెట్టే ముద్దంటున్నాడు. ఎందుకిలా? ఆంధ్రప్రదేశ్‌లో 79.64శాతం పోలింగ్ జరిగింది. ప్రజలు అర్థరాత్రి దాకా ఓట్లేశారు. అందునా మహిళలు, వృద్ధులు పట్టుదలతో అంత రాత్రి కూడా లైన్లో వేచిఉండి ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని గమనించిన టిడిపి శ్రేణులు యుద్ధానికి దిగారు. గొడవలు చేసారు. ఇందుకు పూర్తి సిద్ధంగా ఉన్న వైసీపీ వాళ్లు కూడా తక్కువేం తినలేదు. చంపుకున్నారు. చచ్చిపోయారు. మర్నాటి సాయంత్రానికి బాబుగారికి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దాన్ని చూడటంతోనే పూనకం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో 46,000 ఈవీఎంలు వాడామని సిఈఓ ద్వివేది చెప్పారు. అందులో 45 మెషీన్లు ఇబ్బందిపెట్టాయని ఆయన అంగీకరించారు. వాటిని వెంటనే రిపేర్ కూడా చేసామన్నారు. వెయ్యిలో ఒక్కటి సతాయిస్తే తప్పా? దాన్నే 30శాతంగా ఊదరగొట్టాడు. సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది మొహం మీద వేలు పెట్టి బెదిరించాడు. ఎన్నికల వేళ తనకు అన్నివిధాల సహకరిస్తున్న ఉన్నతాధికారులను కమిషన్ బదిలీ చేస్తే ఈయనగారికి భరించలేనంత నొప్పి కలిగింది. ఎన్నికల కమీషన్ విధులను ఆటంకపరచరాదన్న రాజ్యాంగ స్పృహ కూడా లేని ఈ వ్యక్తి, హుటాహుటిన తన మందీమార్బలాన్నేసుకుని ఢిల్లీ వెళ్లి ఎన్నికల ప్రధానాధికారిని కలిసాడు. రాష్ట్ర ఈసీ మీద, ఈవీఎంల మీద ఫిర్యాదు చేసాడు. సగం వివిప్యాట్ స్లిప్పులను లెక్కించాలట లేదా బ్యాలెట్ పేపర్‌తో తిరిగి ఎన్నికలు నిర్వహించాలట. నిజానికి సుప్రీంకోర్టు ఒక్కో నియోజకవర్గానికి ర్యాండమ్‌గా 5 శాతం వివిప్యాట్‌లు లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని ఇదివరకే ఆదేశించింది.
చంద్రబాబుకేమైనా అభ్యంతరముంటే అప్పుడే స్పందించాల్సింది. తన ఎన్నికలయ్యాక ఇప్పుడు ఆయనకు డౌటొచ్చింది. ఈవీఎంల నిండా తనపట్ల విషాన్ని నింపారేమోనని. సైకిల్‌కు ఓటేస్తే ఫ్యానకు పడిందంటాడు. మధ్యాహ్నం వరకు పోలింగే మొదలవలేదంటాడు. అసలు ద్వివేదినే ఓటేయలేకపోయాడన్నాడు. ఆయన ఓటేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో పెట్టేదాకా ఇదే వాదన. కల్లు తాగిన కోతిలా ఒకటే చిందులు. ఈవీఎంల దొంగగా ముద్రపడిన తన సాంకేతిక సలహాదారు వేమూరి హరికృష్ణప్రసాద్‌ను (రాధాకృష్ణకు బంధువా?) చర్చలకు పంపాడు. తన కోటరీలో ఉన్నవాళ్లు, అత్యంత సన్నిహితులు అందరూ ఇలాంటివాళ్లే. రాధాకృష్ణ, సుజనాచౌదరి, సిఎం రమేశ్, నారాయణ, గంటా, ఐటీగ్రిడ్ ఆశోక్… ఇలా తనచుట్టూ ఓ చంబల్ ముఠాను పెట్టుకుని, పిల్లి కళ్లుమూసుకుని పాలుతాగిన చందంగా, ఈ చిందులేమిటి?
దేశంలో ఉన్న నాయకులు, అధికారులందరూ తనకన్నా జూనియర్లు, తనకింద పనిజేసారని ఒకటే నస. అసహ్యమేస్తోంది. అయితే మాత్రం ఏమిటి? ఏ పదవికుండే హుందాతనం, గౌరవం దానికుంటాయి. ప్రణబ్‌ముఖర్జీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్‌సింగ్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్. మరి మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రణబ్ మంత్రి. ప్రణబ్ ముఖర్జీ ఎప్పడూ మన్మోహన్ తనకింద పనిచేసాడని అనలేదే? అది వారి హుందా. ఆ పదవికిచ్చే గౌరవం. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవడం చరిత్రలో చాలాసార్లు జరిగింది. ఈయన దానికి అతీతుడేంకాదు. క్రమంగా తన విలువను తానే దిగజార్చుకుంటున్న ఓ చావుగాలపు చంద్రయ్య. మోడీ మళ్లీ ప్రధాని అయితే, జగన్ ఇక్కడ ముఖ్యమంత్రి అయితే… అంతే.. గజగజా వణుకులు, ఒళ్లంతా చెమటలు. ఎక్కడ శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించాల్సివస్తుందోనని భయం.
తప్పదు… వస్తాయి. అన్నీ వస్తాయి. కట్టకట్టుకుని, ఒక్కొక్కటిగా, వరుసగా, ఒకదాని వెంట ఒకటి వస్తూనేఉంటాయి. గుర్తుకుతెస్తూనేఉంటాయి. ఎన్టీఆర్, సైకిల్, తెలుగుదేశం, లక్ష్మిపార్వతి, హరికృష్ణ, దగ్గుబాటి, జయప్రద, ప్రభాశంకర్ మిశ్రా, మాధవరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి, జగన్…. ఇవన్నీ రావాలి, తలవాలి, ఏడవాలి… తప్పదు.
– రుద్రప్రతాప్