ప్రస్తుతం దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు వాటి భూభాగాల నుంచే పరిపాలన సాగిస్తుండగా, హైకోర్టులు కూడా వేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో గవర్నర్లు కూడా వేర్వేరుగా ఉంటే బాగుంటుందని కేంద్రం అభిప్రాయ పడుతోందట.
గవర్నర్ నరసింహన్.. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 2009 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. అయితే ఇకపై రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా నూతన గవర్నర్లను నియమించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమిస్తారని తెలుస్తోంది. ఓ వైపు విజయవాడలో గతంలో సీఎం ఆఫీసు కోసం వాడుకున్న కార్యాలయాన్ని నూతన గవర్నర్ కోసం సిద్ధం చేస్తుండగా.. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను కచ్చితంగా నియమిస్తారనే ప్రచారానికి బలం చేకూరింది. దీంతో గవర్నర్ల నియామకం కచ్చితంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.
ప్రస్తుతం దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు వాటి భూభాగాల నుంచే పరిపాలన సాగిస్తుండగా, హైకోర్టులు కూడా వేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో గవర్నర్లు కూడా వేర్వేరుగా ఉంటే బాగుంటుందని కేంద్రం అభిప్రాయ పడుతోందట. అందుకనే త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించాలని కేంద్ర హోం శాఖ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తే.. ప్రస్తుతం ఉన్న గవర్నర్ నరసింహన్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేసి జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల సలహాదారుగా నియమించుకోవాలని కేంద్ర హోం శాఖ భావిస్తున్నదట. ఈ క్రమంలోనే గతంలో మోదీ ప్రభుత్వం వస్తే గవర్నర్‌ను మారుస్తామని కూడా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అందులో భాగంగానే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నూతన గవర్నర్‌ను నియమించాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. దీంతో అతి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు రానున్నారని వార్తలు బాగా ప్రచారమవుతున్నాయి. మరి ఆ ఇద్దరు నూతన గవర్నర్లు ఎవరో.. త్వరలో తేలనుంది..!