చందమామలాంటి చెరువు.. పదండి చూద్దాం..

-

లోనార్‌ సరస్సు
లోనార్‌ సరస్సు

పూర్తి గుండ్రంగా, కాయిన్‌ను పెట్టి, పెన్సిల్‌తో గీసినట్టు, పనిగట్టుకుని ఎవరో ముగ్గుపోసి తవ్వినట్లు ఉండే చెరువును ఎక్కడైనా చూసారా.? పదండి చూద్దాం.. ఎక్కడుందనుకుంటున్నారు.? ఆ భాగ్యం మనకే దక్కింది. ఆ చూడచక్కని సరస్సు మనదేశంలోనే ఉంది. ప్రపంచంలో  ఉన్న ఒకేఒక్క బిలసరస్సు. ప్రపంచ భూవారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన వెలలేని ఆస్థి.

లోనార్‌ బిలం లేదా లోనార్‌ సరస్సు, మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో, లోనార్‌ అనే చిన్న వూరు పక్కన ఉంది. ఆ ఊరుపేరునుండే సరస్సుకు కూడా పేరు వచ్చింది. ఔరంగాబాద్‌ నుండి దాదాపు 140 కి.మీల దూరంలో ఉండే లోనార్‌, ప్రపంచప్రఖ్యాతి గాంచిన అజంతా-ఎల్లోరా గుహలకు కూడా దగ్గరే. అద్భుతమైన అటవీ సౌందర్యాలతో కేవలం నాలుగు గంటలలో చేరుకోవచ్చు. లోనాసురుడనే రాక్షసుడ్ని దైత్యసూదనుడు (మహావిష్ణువు) ఇక్కడే సంహరించాడనీ, అందుకే ఈ ప్రాంతానికి లోనార్‌ అనే పేరు వచ్చిందని స్థానిక కథనం. ఊరికి ఆనుకునే ఈ చెరువు ఉంటుంది. నిజానికి ఈ సరస్సు ఓ బిలంలో ఉంటుంది. దాదాపు రెండు కిలోమీటర్ల వ్యాసంతో, 150 మీటర్ల లోతుతో ఉండే ఈ బిలంలోనే చెరువు ఏర్పడింది. బిలం అంచునుండి 137మీటర్ల లోతులో చెరువు ఉంటుంది.

దాదాపు 52,000 సంవత్సరాల క్రితం 20లక్షల టన్నుల బరువుగల ఓ ఉల్క గంటకు 90,000 కి.మీల వేగంతో ఢీకొంటే ఏర్పడిన గొయ్యి ఇది. కానీ ఇప్పుడు అత్యంత అధునాతన పద్ధతైన ఆర్గాన్ఆర్గాన్‌ డేటింగ్‌ ద్వారా ఈ బిలం ఇంకా పురాతనమైనదని, దాదాపు 5,70,000 ఏళ్లనాటిదని కనుగొన్నారు. తూర్పునుండి 35డిగ్రీల కోణంలో ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల చెరువు కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. 1823లో అలెగ్జాండర్‌ అనే బ్రిటిష్‌ అధికారి దీన్ని మొదటగా చూసాడు. భారీ అగ్నిపర్వత లావాశిలాఫలకమైన దక్కన్‌ పీఠభూమిపై ముందుగా దీన్ని అగ్నిపర్వత బిలంగా భావించేవారు. దీనిపై దేశవిదేశీ శాస్త్రవేత్తల పరిశోధనలు ఊపందుకున్నాక తెలిసింది ఇది ఒక ఉల్క పడితే పుట్టిన బిలమని.కాలక్రమేణా చుట్టూ అడవులు అలుముకొని, ఆ గొయ్యిలోనే నీళ్లు పుట్టి, చెరువుగా తయారైంది. అయితే విచిత్రమేమిటంటే, ఈ నీళ్లు సముద్రపు నీళ్లలా ఉప్పగా, క్షారస్వభావంతో ఉంటాయి.ఈ అరువైన గుణమే ఇప్పుడు పరిశోధకులను అక్కడికి ఆహ్వానిస్తోంది.

Daitya Sudan temple
Daitya Sudan temple

ఎంతోమంది భూశాస్త్రవేత్తలు, పర్యావరణశాస్త్రవేత్తలు, పురాతత్వ శాస్త్రజ్ఞులు, అంతరిక్షపరిశోధకులు ఈ ప్రాంతాన్ని పరీక్షించి, పరిశోధనాపత్రాలు సమర్పించారు. నాసా శాస్త్రజ్ఞులు, భారత జిఎస్‌ఐ (భూపరిశోధనాసంస్థ) సైంటిస్టులు కలిసి అంతుచిక్కని కొన్ని ప్రశ్నలు సమాధానాలు వెతుకుతున్నారు. ఈ నీళ్లు ఇలా ఎందుకున్నాయి.? భూమ్మీద అత్యంత అరుదుగా కనబడే సూక్ష్మ జీవపదార్థం ఇక్కడే ఎందుకుంది.? బిల ప్రాంతంలో కొన్ని చోట్ల దిక్చూచులు ఎందుకు పనిచేయడంలేదు.? అసలు ఈ చెరువు అడుగున ఏముంది.? లాంటి సందేహాలు వారి మదిని తొలుస్తున్నాయి.

ట్రెక్కింగ్‌ లాంటి సాహసక్రీడలకు, పక్షుల పరిశోధకులకుబాగా అనువైన ప్రదేశమిది. ఎన్నో రకాల దేశవిదేశీ పక్షలు ఇక్కడ కిలకిలారావాలు పలుకుతుంటాయి. చరిత్రకారులకు కూడా పనికివచ్చే శతాబ్దాల నాటి వాడుకలోలేని ఎన్నో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.

భారత పురాణాలైన స్కంధ, పద్మ పురాణాల్లో ఈ లోనార్‌ సరస్సు ప్రస్తావన ఉంది. ఈ బిలం ఉన్న బుల్ధానా జిల్లా ఒకప్పుడు అశోక చక్రవర్తి పాలనలో, తరువాత శాతవాహనుల పాలనలో ఉండేది. చాళుక్యులు, రాష్ట్రకూటులు కూడా ఇక్కడ ఏలుబడి సాగించారు. మొఘలులు, యాదవులు, నిజాం, బ్రిటిష్‌ పరిపాలనలో ఇక్కడ వ్యాపారం బ్రహ్మాండంగా సాగిందని చరిత్ర చెబుతోంది. లెక్కలేనన్ని ఆలయాలు ఈ చుట్టుపక్కల ఉన్నాయి. చాలావరకు పాడుబడిపోయాయి.పాక్షికంగా నీళ్లలో మునిగిఉండే గణేశమహేశ్వర ఆలయం, మోతా హనుమన్‌ దేవాలయం, బాగా ప్రసిద్ధిచెందిన దైత్యసూదనాలయం, వాగ్మహాదేవాలయం, కమలజదేవీ ఆలయం.. ఇంకా చాలా గుళ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.ఇక్కడ ఉన్న హనుమాన్‌ ఆలయంలోని మూలమూర్తికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ శిలారూపం ఒక అయస్కాంతశిల. అందుకే దీన్ని మోతా(అయస్కాంతం) మారుతి మందిర్‌ అన్ని పిలుస్తారు. ఈ హనుమాన్‌ మందిరానికి పక్కనే అంబర్‌ సరస్సు ఉంది. ఇది కూడా బిలసరస్సే. పెద్ద ఉల్కతో పాటు వచ్చిన ఒక చిన్న ఉల్కాశకలం ఈ బిలావిర్భావానికి కారణమైంది.

హైదరాబాద్‌ నుండి ఔరంగాబాద్‌కు రోజు రైళ్లు, విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుండి 140కి.మీ దూరంలో లోనార్‌ ఉంది.ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు పొంది. ప్రఖ్యాతిగాంచిన అజంతా-ఎల్లోరా గుహలు, మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ రాజధాని దౌలతాబాద్‌ (దేవగిరి) కోట.. ఇవన్నీ ఔరంగాబాద్‌కు కొద్దిపాటి దూరాల్లోనే ఉన్నాయి. అటువైపు వెళ్లినప్పుడు అన్నీ చూసుకుని రండి.

Read more RELATED
Recommended to you

Latest news