ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా స్క్రీన్‌ప్లేకు ప్రేరణ : ది మోటార్‌సైకిల్‌ డైరీస్‌

-

దర్శక బాహుబలి రాజమౌళి, నిన్నటి తన ప్రెస్‌మీట్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర స్క్రీన్‌ప్లేకు ప్రేరణ ఒక ఇంగ్లీష్‌ సినిమా అని చెప్పారు. అదే ‘ది మోటార్‌సైకిల్‌ డైరీస్‌’. 2004లో విడుదలైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా సినీవిమర్శకుల ప్రశంసలందుకుంది.

ఒక వైద్యవిద్యార్థి, తన స్నేహితుడితో కలిసి సరదాగా బైక్‌పై దక్షిణఅమెరికా యాత్ర చేసినప్పుడు ఎదుర్కొన అనుభవాల సారంశమే ఈ చిత్ర ఇతివృత్తం. గొప్ప సినిమా కానప్పటికీ దర్శకుడి చిత్రానువాద ప్రతిభ మాత్రం వేనోళ్ల కొనియాడబడింది. ఎన్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లలో పాల్గొన్న ఈ సినిమా, అన్ని చోట్లా ప్రశంసలు దక్కించుకుంది. ఎంతో పకడ్బందీగా, బలంగా ఉన్న దీని స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌ ఆఖరి సీన్‌ రాజమౌళిని అమితంగా ఆకర్షించాయి.

ఆ క్రమంలో తను యాధృచ్చికంగా చదివిన ఒక పుస్తకంలో, తెలుగు ఉద్యమపోరాట వీరులు అల్లూరి, కొమురం భీంలు తమతమ యుక్తవయస్సులో దాదాపు మూడేళ్లపాటు ‘మిస్స’య్యారనే అంశం రాజమౌళిని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో అ ఇంగ్లీష్‌, ఈ తెలుగు పాయింట్లను కలిపితే… అనే ఆలోచనను తండ్రి విజయేంద్రప్రసాద్‌తో పంచుకుంటే పుట్టిన కథే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.

ఇంతకే అంతటి బలమైన స్క్రిప్ట్‌తో నడిచిన ‘ది మోటార్‌సైకిల్‌ డైరీస్‌’ కథేంటంటే… 1952లో మెడికల్‌ డిగ్రీ తీసుకోవడానికి  ఇంకా ఒక సెమిస్టర్‌ ఉందనగా, సెలవుల్లో ఎర్నెస్ట్‌ అనే యువకుడు, తన మిత్రుడైన గ్రనాడో అనే బయోకెమిస్ట్‌ను తీసుకుని, దక్షిణఅమెరికా యాత్రకు బయలుదేరాడు. దీనికోసం గ్రనాడో ఏనాడో మూలకుపడేసిన మోటర్‌సైకిల్‌ను తీసి, రిపేర్‌ చేయించి, టూర్‌కు సిద్ధం చేస్తాడు. నిజానికి వాళ్ల టూర్‌ ఆఖర్లో, పెరూలోని ఒక కుష్టురోగుల కాలనీలో కొంతకాలం సేవచేయడమైనప్పటికీ, మొదలుపెట్టింది మాత్రం సంతోషం కోసం, సాహసాల కోసం. అయితే ఈ యాత్రలో భాగంగా వాళ్లు, ఎన్నో ప్రదేశాలు, ఊళ్లు తిరుగుతూ, అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు, పేదరికం, ధనిక-పేద వర్గాల మధ్య పెరుగుతున్న అంతరం చూస్తూ చలించిపోతుంటారు. కథ క్రమంగా తెలియకుండానే గంభీరత సంతరించుకుంటుంది.ఎర్నెస్టో తనకు తెలియకుండానే మెల్లగా ఈ బాధలు, ఘోరాలపట్ల వ్యతిరేకత పెంచుకుని, అక్కడి దొరలు, పెత్తందారీ వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడు. ఇలా అర్జెంటినా, పెరూ, చిలీ లాంటి దేశాలు తిరుగుతూ, అంతటా అలాంటి పరిస్థితుల్నే చూసి బాధపడతారు. ఏదో ఒకటి చేయాలని మిత్రులిద్దరూ తీర్మానించుకుంటారు. ఒక శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభించి, దక్షిణఅమెరికాను సరికొత్తగా మారుద్దామనే గ్రనాడో ప్రతిపాదనను తిరస్కరించిన ఎర్నెస్టో, ఆయుధం లేకుండా విప్లవం పనికిరాదంటాడు. తర్వాత పెరూలోని కుష్టురోగుల కాలనీకి చేరుకుని, మూడువారాలు వలంటీర్‌గా పనిచేస్తాడు. ఆ సమయంలో కుష్టువ్యాధిరోగులు నదికి ఇటుపక్క, వైద్యులు, నర్సులు అటుపక్కా ఉండటం చూసి, కుష్టువ్యాధి అంటురోగం కాదని, తనుకూడా వాళ్లతోనే ఉంటాడు. తిరిగివెళ్లే సమయానికి ఎర్నెస్టో చాలా జీవితసత్యాలు తెలుసుకుంటాడు. లాటిన్‌అమెరికా దేశాలను మనుష్యులు బతికే దేశాలుగా తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని మిత్రుడికి తెలియజేసి, అక్కడే తన తొలి రాజకీయ ప్రసంగం చేస్తాడు. తన రాజకీయ కార్యక్రమాలకు మార్క్సిస్టు విప్లవాన్ని ప్రేరణగా తీసుకుని ఒక కొత్త చరిత్ర లిఖించడానికి బయలుదేరతాడు. అతను ఎర్నెస్టో గువేరా. ప్రపంచప్రఖ్యాతిగాంచిన విప్లవవీరుడు చే గువేరా.

ఇది స్థూలంగా కథ. సినిమా చూస్తున్నవారెవరికీ అది ఒక బయెపిక్‌ అని తెలియదు. సినిమా అయిపోవడానికి ఒక రెండు నిమిషాలముందు మాత్రమే ఆ హీరోనే చేగువేరా అని ప్రపంచానికి తెలుస్తుంది. అంత బలమైన చిత్రానువాదంతో నడిచిన సినిమా అది. అందుకే ఈ చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని, మూడేళ్లు కనబడకుండాపోయిన అల్లూరి, భీంలు ఎక్కడో కలుసుకుని, స్నేహితులై, ఒకర్నుంచి ఒకరు ప్రేరణ పొంది, సమాజానికి మంచి చేయాలనే తపనతో బయలుదేరి నిజమైన వీరులుగా, మనకు తెలిసిన మహాయోధులుగా మారారని రాజమౌళి చెప్పబోతున్నారు.

అయితే దాదాపు ఒకే సమయంలో పుట్టి, ఒకే సమయంలో కనబడకుండాపోయి, ఒకేసారి తిరిగొచ్చి, ఒకేసారి ఇద్దరూ తమతమ ఉద్యమాలు ప్రారంభించడం తనకు అమితాసక్తిని కలిగించిందని చెప్పిన జక్కన్న, ఆ మిస్సయిన మూడేళ్లే.. తన కథ అని తెలిపాడు. నిజానికి ఆ మూడేళ్లు ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లారో, ఏం చేసారో ఎవరికీ తెలియదు. ఇక్కడే రాజమౌళి తన కథాస్వేచ్ఛను ఉపయోగించుకోనున్నాడు. మనకు తెలియని రామరాజు, కొమురంల ఊహాజనిత యవ్వన జీవితగాథను తనదైన శైలిలో, ఊహాతీతంగా ఆవిష్కరించనున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news