ఇప్పటిదాకా రాజకీయాలలో ఏవేవో మార్పులు జరిగేయి. జరుగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధం అయి ఉన్నారు కేసీఆర్. ఆ విధంగా ఆయన ఓ జాతీయ పార్టీ నెలకొల్పితే బాగుండు అని భావించి, అందుకు తగ్గ ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన భారత్ రాష్ట్ర సమితి పేరిటో లేదా భారతీయ రాష్ట్ర సమితి పేరిటో ఓ రాజకీయ పార్టీకి సంబంధిత ఏర్పాట్లకు కొన్ని అడుగులు సానుకూలత ఉన్న దిశగా వేస్తున్నారు.
తెలుగు సాహిత్యం తెలిసిన మనిషిగా కేసీఆర్-కు ఇప్పటికీ ఓ మంచి పేరు ఉంది. మిగతా భాషల్లో (హిందీ మరియు ఇంగ్లీషు) మరీ అంత పట్టు అయితే లేదు. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే ఆ రెండే అవసరం కనుక మళ్లీ వాటిపై కూడా కేసీఆర్ కొంత దృష్టి సారిస్తే ఢిల్లీ డీల్స్ అన్నవి ఇంకాస్త వేగవంతం అవుతాయి. ఇక భాష విషయం అటుంచి కేసీఆర్ నడవడి గురించే చర్చిద్దాం. ఆయన ఒక పట్టాన లేదా ఒకంతట అర్థం కారు. కాలేరు..కాబోరు కూడా !
నిన్నచెప్పిన మాట ఇవాళ చెప్పరు. నిన్న తీసుకున్న నిర్ణయానికి ఇవాళ కట్టుబడి ఉండరు. ఉండలేరు కూడా అన్నది ఓ వాదన మరియు విమర్శ. ముఖ్యంగా ఆయన చేయాల్సిన పనుల్లో వేగం ఉండదు. అలానే స్పష్టత కూడా ఉండదు. కొంత మెంటార్ షిప్ పై ఆధారపడి పని చేసిన దాఖలాలు ఉద్యమ సమయంలో ఉన్నాయి.
ఉద్యమ సమయంలో మాట్లాడేందుకు, శక్తిమంతం అయిన నాయకుడికి ఉండాల్సిన వాగ్ధార ఉండేందుకు ఆ రోజు కేసీఆర్-కు కొందరు క్లాసులు చెప్పారు. తరగతుల బోధించారు. అవి ఫలితం ఇచ్చేయి. ఇప్పుడు కేసీఆర్-కు ఆ విధంగా దేశ రాజకీయాలు ముఖ్యంగా స్వాతంత్ర్యం పూర్వం, తరువా పరిణామాలు, ముఖ్యంగా జాతీయ వాదం నెగ్గిన వైనం, ఓడిన తీరు, మత రాజకీయాలు, ముఖ్యంగా కులాలపేరిట అమలు అవుతున్న రిజర్వేషన్లు వీటన్నంటిపై కేసీఆర్-కు ఉన్న జ్ఞానం తెలంగాణ వరకే! ఇంకా ఆయన తెలుసుకోవాలి. అదేవిధంగా మంచో చెడో రాష్ట్ర పతి ఎన్నికలను కూడా ఓ పావుగా వాడుకుని ఇతర పార్టీలతో సంప్రతింపులు (నెగోషియేషన్స్) జరపాలి. కొంత పరిపక్వ ధోరణిలో కేసీఆర్ ఉంటే మంచి ఫలితాలు అందుకోవచ్చు.ఆ రోజు మాదిరి ఆయన మళ్లీ కొన్ని రాజకీయ తరగతులకు హాజరు అయితే మంచిదే ! అందుకు తగ్గ వాతావరణం కూడా తెలంగాణలో పుష్కలంగా ఉంది. ఎందుకంటే దేశ రాజకీయ పరిణామాల గురించే కాదు ప్రపంచ పరిణామాలపై కూడా ఓ నాయకుడిగా ఆయన మాట్లాడాల్సి ఉంటుంది.. కనుక !