నలుగురు పిల్లలు… స్ఫూర్తి, ప్రణీత, సాయిచైతన్య, వినీత్. ఇంజనీరింగ్ విద్యార్థులు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఫేర్‌వెల్‌పార్టీ చేసుకుందామనుకున్నారు. అందరూ కలిసారు. మొత్తం 15మంది. ఏడుగురు అమ్మాయిలు, ఎనిమిది మంది అబ్బాయిలు. ఓ గెస్ట్‌హౌస్ అడ్డా. మధ్యాహ్నం నుంచీ ఈతలు, పోతలు. రాత్రికి సిగరెట్ల అవసరం. బయటికెళ్లిన ఐదుగురు తిరిగిరాలేదు. పై నలుగురు తిరిగిరాని లోకాలకు వెళ్లగా, ఒకరు దవాఖానాలో.. చావుబతుకుల మధ్య… ఎవరు కారణం? ఎవరు బాధ్యత వహిస్తారు?
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మల రామారం మండలం, మైసిరెడ్డిపల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వీరు, వీరితోపాటు ఇంకో 11 మంది యువతీయువకులు, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో గల శ్రీవిద్య ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ ఆఖరి సంవత్సరంలో ఉన్నారు. ఫైనల్ పరీక్షలు కూడా అయిపోయాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లమయ్యామన్న ఆనందంలో పార్టీ చేసుకుందామనుకున్నారు.
బొమ్మల రామారం శివార్లలో గల బృందావన్ మార్వాడీ గెస్ట్‌హౌస్ బుక్ చేసుకుని, మధ్యాహ్నానికల్లా అందరూ సకల ‘సామాగ్రి’తో అక్కడికి చేరుకున్నారు. అన్నట్టు ఆ గెస్ట్‌హౌస్‌లో స్విమింగ్ పూల్ కూడా ఉంది. ఇక మొదలైన ‘ఆనందం’ అర్ధరాత్రి దాకా సాగుతోంది. ఇంతలో సిగరెట్లు అయిపోవడంతో తెస్తామని ఓ ఇద్దరు బయలుదేరగా, మేమూ వస్తామని ఇంకో ఇద్దరు జాయినయ్యారు. నలుగురు తమ కారులో రాత్రి పదిన్నర ప్రాంతంలో మెయిన్‌రోడ్డు మీదకు వద్దామని వస్తూ, మైసిరెడ్డిపల్లి గ్రామశివారులోని మన్యంబావి కల్వర్టు వద్ద అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలో పడి నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో స్ఫూర్తిరెడ్డి, ప్రణీతఅనే ఇద్దరు అమ్మాయిలు, సాయిచైతన్య అనే ఒక అబ్బాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా, వినీత్‌రెడ్డి మృతిచెందాడు. మనీష్‌రెడ్డి అనే అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం అందుకున్న మిగతా విద్యార్థులు గెస్ట్‌హౌస్ ఖాళీ చేసి వెళ్లిపోయినట్టుగా చెపుతున్నారు. గెస్ట్‌హౌస్ చేరుకున్న పోలీసులు పరిసరాలు పరిశీలించగా, మద్యం సీసాలు, హుక్కా గొట్టాలు, కండోమ్ ప్యాకెట్లు లభించాయి.
ఇదీ జరిగిన సంఘటన
అందరు పిల్లలు దాదాపు 21 ఏళ్ల వయసువారు. ఇంజనీరింగ్ అయిపోగానే, మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని ఒకరు, యూఎస్ వెళ్లి, ఎంఎస్ చేద్దామని ఒకరు.. ఇలా తమకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నవాళ్లు చివరికి మిగిల్చిందేమిటి? కన్నవాళ్లకు తీరని పుత్రశోకం. తోటివాళ్లకు జీవితాంతం వెంటాడే ఒక భయానక పీడకల. ఇక్కడ ఎవరిది తప్పు? నిండా ఇరవైరెండేళ్లు లేనివాళ్లు, అంతా కలుసుకుని చేద్దామనుకున్న ఎంజాయ్‌మెంట్ ఏమిటి? ఈ వయసులో ఆ తాగడమేమిటి? హుక్కాలేంటి? కండోమ్‌లేంటి? పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు? తల్లిదండ్రులు ఎటువైపు చూస్తున్నారు?
పిల్లల ప్రవర్తన, వారి అలవాట్లు ఎలా ఉంటున్నాయో గమనించేంత తీరక తల్లిదండ్రులకు ఎందుకు లేకుండా పోతోంది? అంత తీరికలేని సంపాదన ఎవరి కోసం? మరీ డిగ్రీ చదువుతున్న, అయిపోయిన పిల్లల పరిస్థితి దారుణంగా ఉంటోంది, తాము ఏం కోల్పోయామో, ఏం సాధించామో కూడా తెలియనంత మైకంలో ఉంటున్నారు. మెడిసిన్, ఐఐటీలు, ఎన్‌ఐటీల సంగతి సరేసరి. ఎంసెట్ లో కూడా వేలల్లో, వీలైతే లక్షల్లో ర్యాంకులు తెచ్చుకుని, అమ్మానాన్నలను పీడించి ఏదో ఓక ప్రయివేటు ఇంజనీరింగ్ / డిగ్రీ కాలేజీల్లో లక్షలు పోసి, సీటు సంపాదించి… ఇక అక్కన్నుంచి పల్సర్ బైకులు, యాక్టివా స్కూటర్లు, ఐఫోన్లతో హవా. ఫేస్‌బుక్కులు, వాట్సప్‌లు, పబ్‌జీలు, అవెంజర్స్‌లు, ఐమాక్స్‌లతో కాలక్షేపం. చివరికి పాసవడం ఏ 54 శాతమో, 58శాతమో మార్కులతో. అందరి రెజ్యూమెలు కామన్‌గానే ఉంటాయి. సి, సి++, జావా, ఒరాకిల్, విండోస్ 98, ఎక్స్‌పీ, 2000, లైనక్స్. ఎవరికీ ఏమీ రాదు. అంతా ఉత్తదే. ఇలా వేలాదిమంది పాసై (ఎలా పాసవుతున్నారో.. అస్సలు అర్థంకాదు) రోడ్లమీదకు వస్తున్నారు. ఒక రాయి బయటికి విసిరేస్తే బి.టెక్ గ్రాడ్యుయేట్ మీదే పడేంత. తెలుగు రాష్ట్రాల్లోనున్న ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో 67 శాతం మందికి ఉద్యోగానికి కావలసిన ప్రాథమిక నైపుణ్యాలు కూడా లేవని ఒక ఉద్యోగకల్పనా సంస్థ తమ పరిశోధనలో తేలిందన్నారు. ఎంత ఘోరం?
వీళ్లేంచదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎటు తిరుగుతున్నారు, ఇంటికి ఎప్పుడొస్తున్నారు?…..అని ఎంతమంది అమ్మానాన్నలు పరిశీలిస్తున్నారు? యవ్వనంలో ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలని పెద్దలంటారు. నిజమే. స్నేహితుల్లానే ఉండాలి. ఆ స్నేహంలోనుండే వారి గమనాన్ని పరీక్షిస్తుండాలి.
దారితప్పతున్నారనుకుంటే, వెంటనే సరైన దారిలోకి తేవాలి. పిల్లలకు స్వేచ్ఛనివ్వాల్సిందే. కానీ దేనికోసం? వాళ్ల కెరీర్‌ను ఎంచుకోవడానికి, ఏది మంచి, ఏది చెడు తెలుసుకోవడానికి, తోటి మనుషుల్ని చదవడానికి, తమని తాము గొప్పగా మలచుకోవడానికి. అంతేకానీ, ఏ గమ్యమూ లేకుండా బలాదూర్‌గా తిరగడానికి కాదు. ఈ విషయంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలకేం తీసిపోవడంలేదు. కానీ, ఈ వయసులో ఇన్ని రకాల సంబంధాలు నెరిపితే, భవిష్యత్తులో ఏ బంధం మీద కూడా వారికి గౌరవం ఉండదు. వివాహవ్యవస్థ మీద ఉన్న నమ్మకం సడలిపోతుంది. ఈ ఒక్క కారణం చేతనే వందలాదిమంది ఐటీ ఉద్యోగుల పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయని మ్యారేజి కౌన్సెలర్లు, లాయర్లు చెపుతున్నారు.
చెట్టంత కొడుకో, కూతురో హఠాత్తుగా మాయమైపోతే, ఆ అమ్మానాన్నల గుండెలు పగిలిపోవా? కళ్లల్లో నీళ్లు ఇంకిపోవా? వద్దు… ఇటువంటి దారుణాలు చూడ్డానికి ఏ తల్లిదండ్రులూ బతికిఉండాల్సిన అవసరంలేదు. కానీ వాళ్ల జీవనపయనానికి మనమే తొలిబాధ్యత వహించాలి. తల్లిదండ్లులుగా మీరు పిల్లలకి కావలిసినంత స్వేచ్ఛనివ్వండి. అలాగే ఒక వ్యక్తిత్వాన్ని ఇవ్వండి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యానివ్వండి. చాలు. మీరు పట్టుకున్న లాంతరు వెలుతురులో వాళ్లు సరైన దారిలో సాగిపోతారు. తమ గమ్యాన్ని చేరుకుంటారు.
-చంద్రకిరణ్