మాట్లాడే స్థాయి వద్దు
ఎందుకు మాట్లాడడం
ఆచరణ కావాలి
పనికి మాలిన మాటలు వద్దు
అని పదే పదే పవన్ అంటారు
కనుక ఆచరణకు తూగే పనులు
పవన్ చేయాలి జగన్ తో చేయించాలి
తన సాయంతో మళ్లీ అధికారంలోకి వస్తే
ఈ సారి టీడీపీని కూడా దార్లో పెట్టాలి
నిన్నటి ఆవిర్భావ సభ తరువాత పవన్ తిరుగులేని రాజకీయ శక్తి అవుతారా అన్న సందేహం ఒకటి వినిపిస్తోంది.జనసేన ఇవాళ క్షేత్ర స్థాయిలో బలహీనంగా ఉంది అని అందుకే ఎప్పుడూ పొత్తులపై ఆధారపడుతూ ఉందని బీజేపీ అనుకూల వర్గం కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కూడా సోషల్ మీడియా వేదికగా బీజేపీ అనుకూల వర్గం ఇంకొన్ని వ్యాఖ్యలు చేస్తోంది కూడా! అయినా కూడా జనసేన మాత్రం వీటిని పట్టించుకుని దిద్దుకునే దిశలో లేదు. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే చర్యలకు కూడా ఉపక్రమించిన దాఖలాలు లేవు.ఇవే ఇప్పుడు పవన్ కు మైనస్ కానున్నాయి.
వాస్తవానికి 2014లో పవన్ గెలవాల్సిన వ్యక్తి అవునో కాదో తెలియకుండానే పోటీ నుంచి అనూహ్యంగా తప్పుకుని ఆ ఒక్క ఛాన్స్ తెలుగుదేశానికి ఇచ్చేశారు. ఆ విధంగా ఓ పెద్ద తప్పిదం అయితే చేశారు. కానీ తరువాత కూడా వాటి నుంచి ఏ పాఠాలూ నేర్చుకోలేదు. పార్టీ నడిపే క్రమంలో కొన్ని పోరాటాలు తరువాత కాలంలో చేశారు.వైసీపీ కన్నాపరిపక్వతతో కూడిన వ్యాఖ్యలే చేశారు. ఇంకా చెప్పాలంటే పవన్ మిగతావారిలా కాకుండా పరిణామాలను అర్థం చేసుకుని మాట్లాడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కూడా! జగన్ వచ్చాక ఆయన శైలి కాస్త మారి ఆయనను ఉద్దేశించి జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని ఒకటికి పది సార్లు అనడం ప్రారంభిస్తే వైసీపీ మాత్రం పవన్ నాయుడు అని ఒకటి రెండు సార్లు అని ఊరుకుంది. ఏదేమయినా పవన్ ను తిడితే వైసీపీకే నష్టం.
ఈ ఒక్క నిజం పవన్ కూ తెలుసు.కానీ పవన్ మాత్రం తనదైన పోరాట పటిమ చూపలేకపోతున్నారు.సినిమాలు చేస్తూ రాజకీయం చేయడం తప్పు కాకపోయినా ఇబ్బందులు అయితే ఆయనకు ఇవాళ్టికీ ఉన్నాయి. రాజకీయ ఎదుగుదల, సామాజిక ఎదుగుదల అన్నవే కీలకం అయి ఉన్నాయి.వీటి విషయమై పవన్ ఇప్పటికిప్పుడు సాధించేదేమీ లేకపోయినా మున్ముందు కాలంలో జనసేన నిర్మాణం మరింత పటిష్టం అయితే అప్పుడు క్రియాశీలక కార్యకర్తల స్థాయి మాట్లాడే స్థాయి నుంచి పోట్లాడే
స్థాయికి వస్తే పవన్ తిరుగులేని నేత అవుతారు.
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి