సాధారణంగా పిల్లలకు నాన్నంటే భయం ఉంటుంది. ఏం చేస్తే ఏమంటాడోనని పిల్లలు జంకుతుంటారు. కానీ నిజానికి నాన్నంటే.. ఓ స్నేహితుడు.. త్యాగానికి ఆయన ప్రతిరూపం.. బిడ్డల భవిష్యత్తు కోసం తన సుఖాలను కూడా నాన్న త్యాగం చేస్తాడు. తన పిల్లలు సుఖంగా, సంతోషంగా ఉండేందుకు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తాడు. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆయన కొవ్వొత్తిలా కరిగిపోతాడు. తన జీవితాన్ని ధారపోస్తాడు.. పిల్లలు తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుతూ.. వారిని సరైన దారిలో నడిపిస్తూ.. వారికి ఆయన ఓ మార్గనిర్దేశకుడు అవుతాడు..
పిల్లల్ని గారాబంగా పెంచేది తల్లే అయినా.. వారిని వేలు పట్టుకుని నడిపించేది మాత్రం తండ్రే.. బాధలు, దుఖాలను దిగమింగుతూ.. సంతోషాలు, సుఖాలను తండ్రి తన పిల్లలకు అందిస్తాడు. పిల్లలే ఆయన ప్రపంచం.. పిల్లల సంతోషం కోసం నాన్న ఏమైనా చేస్తారు.. ఆయన పెంపకంలో కాఠిన్యం ఉంటుందే కానీ.. ఆయన మనస్సు మాత్రం వెన్న.. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని సున్నితమైన హృదయం నాన్నది.. ఇంట్లో నాన్న ఉన్నారు అంటే.. పిల్లలకు అదొక ధైర్యం.. తమకు రక్షణగా ఉంటారనే ఒక భరోసా.. సమాజంలో అమ్మకు ఎంత ప్రాధాన్యత ఉందో.. అందుకు తగినట్లుగానే నాన్నకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది..
తల్లి బిడ్డలను నవ మాసాలు మోసి కంటుంది.. తండ్రి బిడ్డల జీవితాన్ని 100 ఏళ్లు మోస్తాడు.. వృద్ధాప్యం వచ్చినా తండ్రి తన బిడ్డల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం నాన్న నిరంతరం పరితపిస్తూనే ఉంటాడు. అందుకనే కుటుంబంలో తండ్రి పాత్ర ప్రాధాన్యతను గుర్తించిన అమెరికా ప్రతి ఏటా జూన్ 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా జరుపుకోవాలని ప్రకటించింది. ఇక ఈ సారి రేపు ఆ దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. 1966 నుంచి ఫాదర్స్ డేను అధికారికంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
అయితే ప్రస్తుతం అన్నింట్లో పోటీతత్వం బాగా పెరిగిపోయిన దృష్ట్యా తండ్రి బాధ్యత కూడా ఇప్పుడు బాగా పెరిగిందనే చెప్పవచ్చు. అది మరింత క్లిష్టతరం కూడా అవుతోంది. ఎందుకంటే.. తమ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రతి తండ్రి భావిస్తున్నాడు. అందుకనే వారి చదువుల దగ్గర్నుంచీ వారు జీవితంలో స్థిరపడే వారకు తండ్రి అన్నింటా కచ్చితంగా మరింత ఎక్కువ బాధ్యతను తీసుకుంటున్నాడు. అయితే ఒక వ్యక్తి తన పిల్లలకు మంచి తండ్రిగా ఎలా ఉండవచ్చు.. అనే విషయంపై మానసిక వైద్య నిపుణులు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. అవేమిటంటే…
- పిల్లలను ప్రయోజకులను చేయాలన్న తపన తండ్రిలో ఉండాలి. అదే భావం పిల్లలకు తెలియాలి. దీంతో పిల్లలు తమ తండ్రి గురించి గొప్పగా ఆలోచిస్తారు.
- పిల్లలపై తండ్రులు అది కఠినంగా ఉండకూడదు. అలా అని చెప్పి మరీ అతి గారాబం కూడా పనికిరాదు.
- పిల్లల ఎదుట తండ్రులు హుందాగా ఉండాలి. మద్యం సేవించడం, పొగ తాగడం చేయరాదు. అలాగే అసభ్యకర పనులు చేయరాదు. అలాంటి పదజాలం వాడరాదు.
- పిల్లలకు 15 ఏళ్ల వరకు మాత్రమే తండ్రిలా ఉండాలి. ఆ తరువాత వారికి తండ్రి ఒక స్నేహితుడిలా మారాలి.
- పిల్లలు ఏ సందేహం అడిగినా చెప్పాలి. మంచి, చెడుల గురించి వివరించాలి. సమాజంలో ఎలాంటి సంఘటనల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి .
- పిల్లలపై తండ్రి పెత్తనం చెలాయించాలని చూడకూడదు. అది వారిలో మొండితనాన్ని పెంచుతుంది.
- తండ్రి నిత్యం అనేక సమస్యలతో సతమతం అవ్వవచ్చు. కానీ పిల్లలపై ఎప్పుడూ ఆ ప్రభావాన్ని చూపించరాదు. అలాగే పిల్లలతో నిత్యం కనీసం 1 గంట సేపు అయినా గడపాలి. వారి పాఠశాల లేదా కాలేజీల్లో జరిగే విషయాలను అడిగి తెలుసుకోవాలి. అలాగే వారికి చదువు లేదా ఇతర అంశాల పరంగా ఎలాంటి సమస్యలైనా ఉన్నాయా, లేదా అనేది వారిని అడిగి తెలుసుకోవాలి.
- మార్కులు తక్కువ వస్తే పిల్లలను తిట్టరాదు, కొట్టరాదు. సున్నితంగా వ్యవహరించాలి. మార్కులు తక్కువ వస్తే, సరిగ్గా చదవకపోతే ఎలాంటి కష్ట, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో పిల్లలకు తెలియజేయాలి. అలాగే వారికి చక్కగా చదువుకొమ్మని చెప్పి నెమ్మదిగా నచ్చజెప్పాలి. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు.
- తండ్రి తన పిల్లలందరిపై సమానంగా ప్రేమను చూపించాలి. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న భావన పనికిరాదు.
- ఇతర పిల్లలను పోలుస్తూ తండ్రులు తమ పిల్లలను తక్కువ చేసి చూపించరాదు. అది వారి మనస్సును నొప్పిస్తుంది. కనుక పిల్లల మనస్సు ఎప్పుడూ నొప్పించకుండా వ్యవహరించాలి.
- పిల్లల పుట్టినరోజులను కుటుంబంతో సంతోషంగా జరుపుకోవాలి. ఇది వారికి మరింత ఉత్సాహాన్నిస్తుంది.