నల్లకోటుని వదిలి.. తెల్లోళ్ళని ముప్పుతిప్పలు పెట్టి.. ప్రాణం వదిలిన సమర యోధుడు

-

స్వాతంత్య్రం కోసం భారత్‌లో జాతీయోద్యమానికి తోడు విదేశాల్లో జరిగిన ప్రయత్నాలూ తక్కువేం కాదు. బ్రిటన్‌కు వ్యతిరేకమైన జర్మనీ, స్విట్జర్లాండ్‌, జపాన్‌లు వేదికగా అనేక మంది ఉద్యమాలకు ప్రయత్నించారు. కానీ ఏకంగా బ్రిటిషర్ల గడ్డ లండన్‌ నుంచే ఉద్యమానికి ఊపిరిలూదిన ధీరుడు శ్యామ్‌జీ కృష్ణవర్మ! సావర్కర్‌లాంటి హిందూవాదుల నుంచి రామన్‌ పిళ్లైలాంటి సామ్యవాద విప్లవకారుల దాకా అందరికీ ఆయన ఏర్పాటు చేసిన ఇండియన్‌ హౌసే ఆశ్రయం ఇచ్చింది.

సిపాయిల తిరుగుబాటు సంవత్సరం (1857)లో గుజరాత్‌లోని కచ్‌లో జన్మించిన కృష్ణవర్మ ముంబయిలోని విల్సన్‌ హైస్కూల్‌లో చదివారు. సంస్కృతంలో పాండిత్యం సంపాదించారు. సంపన్నకుటుంబానికి చెందిన భానుమతిని పెళ్లాడారు. 1875లో స్వామి దయానంద సరస్వతి స్ఫూర్తితో వేదతత్వంపై అధ్యయనం చేసి… (1877లో) వారణాసి నుంచి పండిట్‌ బిరుదు పొందిన తొలి బ్రాహ్మణేతరుడు కృష్ణవర్మ! ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లి లా చేసి 1885లో భారత్‌కు తిరిగొచ్చిన ఆయన లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలెట్టారు. వ్యాపారాల ద్వారా కూడా బాగా సంపాదించేవారు.

1897లో లా వృత్తికి రాజీనామా చేసి మళ్లీ లండన్‌ వెళ్లారు. 1900లో అక్కడ ఇండియన్‌ హౌస్‌ను నిర్మించారు. తన దగ్గరున్న డబ్బుతో భారత్‌లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలిచ్చేవారు. లండన్‌లో చదువుకోవటానికి కూడా వారిని ప్రోత్సహించేవారు. ఇలా వచ్చే విద్యార్థులతో, భారతీయులతో కృష్ణవర్మ ఇండియన్‌ హౌస్‌ క్రమంగా లండన్‌లో జాతీయోద్యమ వేదికగా రూపాంతరం చెందింది. వీర్‌ సావర్కర్‌, భికాజీ కామ, లాలా హర్‌దయాళ్‌, మదన్‌లాల్‌ ధింగ్రాలాంటి వారంతా కృష్ణవర్మ ఇంట్లో తయారైనవారే. ఇండియన్‌ సోషియాలజిస్ట్‌ మేగజీన్‌ స్థాపించి… బ్రిటిష్‌పాలనపై వ్యాసాలు రాసేవారు కృష్ణవర్మ. స్వరాజ్య సాధన లక్ష్యంగా 1905లో ఇండియా హోమ్‌రూల్‌ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు.

బ్రిటన్‌తోపాటు మిగిలిన ఐరోపా దేశాల్లోనూ భారత స్వాతంత్య్ర ఆవశ్యకతను విడమరచి చెప్పే ప్రయత్నం చేశారు. వీటన్నింటితో కృష్ణవర్మను లక్ష్యం చేసుకుంది బ్రిటన్‌ ప్రభుత్వం. బ్రిటన్‌ కోర్టుల్లో ఆయన అడుగుపెట్టకుండా నిషేధించారు. నిఘా పెంచారు. పోలీసుల ఒత్తిడి పెరగటంతో తప్పించుకొని ఫ్రాన్స్‌కు చేరుకున్నారాయన. వెనక్కి రప్పించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రయత్నించినా… ఫ్రాన్స్‌ రాజకీయవర్గాల్లో ఆయనకున్న బలం కారణంగా అది సాధ్యపడలేదు. కింగ్‌ జార్జ్‌ ఫ్రాన్స్‌ పర్యటన నేపథ్యంలో అక్కడి నుంచి స్విట్జర్లాండ్‌ వెళ్లిన కృష్ణవర్మ ఒంటరిగా గడపాల్సి వచ్చింది. అక్కడ ఆయన్ను గృహనిర్భందంలో ఉంచారు. బ్రిటన్‌ గూఢచారులు, తన సన్నిహితులనుకున్నవారు మోసం చేయటంతో… 1930లో స్విట్జర్లాండ్‌లోనే కన్నుమూశారు కృష్ణవర్మ!

తన జీవితాన్ని, సంపదనంతటినీ భారత స్వాతంత్య్ర సాధనకోసం దానం చేసిన ఆయన… మరణించే ముందు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తన అస్థికలను భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాకే అప్పగించాలని! ఆయన మరణ వార్తను కూడా లోకానికి తెలియకుండా చేయాలని బ్రిటన్‌ చూసినా విఫలమైంది. లాహోర్‌ జైలులో భగత్‌సింగ్‌ తదితరులు ఆయనకు నివాళి అర్పించారు. 2003లో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి స్విస్‌ ప్రభుత్వం కృష్ణవర్మ అస్థికలను అప్పగించింది. ఆయన స్మృతి చిహ్నంగా లండన్‌లోని ఇండియన్‌ హౌస్‌లాంటి ఇంటినే మాండ్వాలో గుజరాత్‌ ప్రభుత్వం నిర్మించింది. కచ్‌ విశ్వ విద్యాలయానికి ఆయన పేరు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news