ఈ ‘రాఖీ’కి మీ గిఫ్ట్స్ ని అప్ డేట్ చేయండి.. మీ తోబుట్టువులకు ‘రక్ష’గా నిలవండి

-

ఆత్మీయబంధాల సవ్వడి.. తోబుట్టువుల ప్రేమకు కట్టిన గుడి రాఖీపౌర్ణమి పర్వదినం. తోబుట్టువు తన జీవితానికి పెట్టని కోటగా ఉన్నప్పుడు సోదరులు తమ వంతు కర్తవ్యంగా ఆమెకు రక్షణగా నిలుస్తారు. ఈ ధర్మ పరిరక్షణ ప్రభోదమే రక్షా బంధన్ పండుగ. తమ సోదరులు తమకు రక్షణగా ఉండాలని ఈ పర్వదినాన సోదరుల చేతికి అక్కాచెళ్లెల్లు రాఖీ కడతారు. ఈ జనరేషన్ లో ఆడపిల్లల రక్షణ ఓ సవాల్ గా మారింది. వారిని రక్షించడం కోసం మీరు కొంచెం అప్ గ్రేడ్ అవ్వాల్సిందే. అంటే వాళ్లకి మీరిచ్చే గిఫ్ట్స్ కూడా అప్ గ్రేడ్ కావాల్సిందే. మరి ఈ రాఖీకి మీరు మీ అక్కాచెళ్లెల్లకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా.. ఓ సారి ఈ గిఫ్ట్స్ పై లుక్కేయండి. తప్పకుండా మీ తోబుట్టువులు మీ ఆలోచనలకు ఫిదా అవుతారు. అవేంటంటే..

ఓ మంచి ప్రణాళికను సిద్ధం చేయండి..  

ఈ జనరేషన్ ఆడపిల్లలు చాలా స్వతంత్రంగా బతుకుతుకున్నారు. వారి సంపాదన వారే ఆర్జిస్తున్నారు. వారి ఖర్చులకు వారి డబ్బే ఖర్చుచేస్తున్నారు. ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తున్నారు. అయితే సంపాదించడం వరకు ఓకే కానీ.. కొందరికి ఈ సంపాదన ఎలా కాపాడుకోవాలి అనే దానిపై అవగాహన ఉండటం లేదు. అందుకే ఈ రాఖీ పండుగ రోజున మీ అక్కాచెళ్లెల్లకు ఆర్థిక వ్యవహారాలపై కాస్త అవగాహన కల్పించండి. వారికి ఓ నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించి ఇవ్వండి. ఆమె భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయండి. చదువు, ఉద్యోగం, మదుపు, పొదుపు, వివాహానంతర జీవితం.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వారికి ఆర్థిక భరోసానిచ్చే చక్కటి ప్రణాళికను వారి చేతిలో పెట్టండి. అవసరమైతే.. ఆర్థిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లి వివరించే ప్రయత్నం చేయండి.

మదుపు సాధనాలను సూచించండి..

సంపాదించడం ఎంత అవసరమో.. దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామో.. ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసుకోవడం అంతకంటే ఎక్కువ అవసరం. అందుకే డబ్బు ఎలా పొదుపు చేయాలో మీ తోబుట్టువులకు చెప్పందచి. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే మదుపు మార్గాలను మీ సోదరికి సూచించండి. చదువుకునే వయసులోనే వారికి ‘పాకెట్‌ మనీ’ని ఎలా పొదుపు చేయాలో చెప్పండి. చేసిన పొదుపును పోస్టాఫీసు ఖాతాల్లో మదుపు చేయించండి. వచ్చే రాబడి ఎలా ఉంటుందో వారికి వివరించండి. తక్కువ వయసులో ప్రారంభించి దీర్ఘకాలంలో దాన్ని కొనసాగించడం వల్ల ఉండే ప్రయోజనాల్ని సోదాహరణతో చెప్పండి. సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్స్‌ ఖాతా.. వంటి ప్రాథమిక ఆర్థిక మదుపు సాధనాలను వారికి పరిచయం చేయండి. ఒకవేళ మీ అక్కాచెల్లెళ్లు పెద్దవారైతే.. మ్యూచువల్‌ ఫండ్స్‌, సిప్‌, స్టాక్‌ మార్కెట్‌, బాండ్స్‌ వంటి పెద్ద పెద్ద పెట్టుబడి మార్గాల్లో ఉండే ప్రయోజనాల్ని వివరించండి.

బీమాతో ధీమా ఇవ్వండి..

కేవలం అక్కాచెల్లెళ్ల ఆరోగ్యానికే కాదు.. వారి భవిష్యత్తుకూ భరోసా కల్పించాలి. అందుకు బీమా పాలసీ కొనిపెట్టడం ఓ మంచి మార్గం. వారికోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో పాటు ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవాలి. ఎంత తక్కువ వయసులో తీసుకుంటే వారికి అంత ప్రయోజనం. దీనివల్ల భవిష్యత్తులో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది. మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో వారికి మంచి బహుమతి ఇచ్చినవారమవుతాం.

డిజిటల్‌ బంగారం బెటర్‌..

ఈ రాఖీ పండుగ సందర్భంగా కొంత మంది తమ సోదరీమణులకు బంగారాన్ని బహుమతిగా ఇస్తుంటారు. అయితే, భౌతిక బంగారం కంటే పసిడి బాండ్లను కొనివ్వడం మేలు. ఇప్పుడు అవి అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఆ సొమ్మును పక్కకు తీసి ప్రభుత్వం వాటిని విక్రయించినప్పుడు కొని గిఫ్ట్‌గా ఇవ్వండి. దీనివల్ల బంగారంతో పాటు ఏటా కొంత రాబడిని కూడా అందించిన వారవుతారు. భద్రత కరవైన ఈ తరుణంలో డిజిటల్‌ రూపంలో గోల్డ్‌ కొనివ్వడం కూడా మంచి ఆలోచనే.

ఆర్థిక అక్షరాస్యత.. దేశానికీ భరోసా..

ఆర్థిక విషయాలపై పెద్దగా అవగాహన లేనట్లయితే.. ముందుగా వారిని ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం సోదరుల బాధ్యత! ఇప్పుడు యూట్యూబ్‌లో, యాప్‌లలో అనేక ప్రోగ్రామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందులో వారి పేర్లను నమోదు చేయండి. కోర్సులను పూర్తి చేసి అవగాహన పెంచుకునే అవకాశం కల్పించండి. డబ్బు కాంపౌండింగ్‌, మదుపు, స్థిరాస్తి.. వంటి అంశాలపై అవగాహన ఏర్పడేలా చూడండి. వివిధ పథకాల్లో వచ్చే రాబడి వెనుకున్న సూత్రాల్ని వివరించి చెప్పండి. పెళ్లైన తర్వాత ఇంటి ఖర్చులను ఎలా నిర్వహించాలో తెలియజెప్పండి. ఒకవేళ ఇంట్లో ఆడవాళ్లే గనక ఆర్థిక సాధికారిత సాధిస్తే.. అది ఆ కుటుంబం మొత్తాన్ని సరైన దారిలో తీసుకెళ్తుంది. భవిష్యత్తు తరాలకూ గొప్ప జ్ఞానం అందుతుంది.

ఇప్పటికీ భారత్‌లో ఆర్థికపరమైన విషయాల్లో మహిళల పాత్ర తక్కువేనని అనేక నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి. మరి ఈ తరుణంలో మన అక్కాచెల్లెళ్లకు రక్షాబంధన్‌ సందర్భంగా ఆర్థిక సంబంధిత బహుమతి అందజేయడం వల్ల కేవలం వారి జీవితానికి భరోసా కల్పించడమే కాకుండా దేశ నిర్మాణంలోనూ వారికి భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పించినవారమవుతాం..!

Read more RELATED
Recommended to you

Latest news