యావత్ తెలంగాణ ప్రజల మది నిండా నిలిచే నిర్మాణం అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అమర వీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఫినిషింగ్ వర్క్స్ వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తుది మెరుగులు దిద్దాలని తెలిపారు.
స్మారక చిహ్నం తుదిదశ పనులను మంత్రి వేముల పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగిన ప్రశాంత్ రెడ్డి… ప్రధాన ద్వారం, ఫౌంటెయిన్, ల్యాండ్ స్కేప్ ఏరియా, గ్రీనరీ, పార్కింగ్ ఏరియా, నిర్మాణ లోపలి భాగంలో ఆర్ట్ గ్యాలరీ, ఆడియో విజువల్ రూం, పైఅంతస్తుకు వెళ్లేందుకు ఎస్కలేటర్, లిఫ్ట్ లు పరిశీలించారు. కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్ పనులు పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులు చేసిన త్యాగాలను చిరకాలం గుర్తుచేసేలా స్మారక స్తూపం నిలిచిపోతుందని తెలిపారు.