కరోనా పుట్టినల్లైన చైనాలో మళ్లీ ఆ మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. కొవిడ్ కట్టడికి జీరో కొవిడ్ విధానాన్ని అమలు చేసిన ఆ దేశం.. ప్రజల నుంచి వ్యతిరేకతలు వస్తున్నందున ఆ విధానాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ ఉపసంహరణే చైనాకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇప్పటికే వైరస్ తన విశ్వరూపం చూపిస్తోంది. ఈ నెలాఖరు వరకు బీజింగ్‌లో దాదాపు అందరికీ వైరస్ సోకుతుందని నేచర్ మెడిసిన్ జర్నల్ ఓ అధ్యయాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఇది ఆ దేశ వాసులను వణికిస్తోంది.
ఇప్పటికే చైనాలో గత నెల రోజుల్లో దాదాపు 60,000 మంది కరోనాతో మరణించారని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. కొవిడ్ కేసులు, మరణాలపై పారదర్శకంగా సమాచారం ఇవ్వడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచదేశాల నుంచి విమర్శలు రావటం వల్ల చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది. కొవిడ్ కారణంగా శ్వాసకోశ వ్యవస్థ విఫలమై 5,503 మంది, కొవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య కారణాలతో మరో 54,435 మంది మరణించినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. మృతుల సగటు వయసు 80 ఏళ్లుగా పేర్కొంది. మరణించిన వారిలో 90 శాతం మంది 65ఏళ్లకు పైబడిన వారేనని తెలిపింది.