కేంద్ర ప్యాకేజీ.. మీకు ఎంత కేటాయించారో తెలుసా..?

-

కరోనా దెబ్బకు సర్వం కోల్పోతున్న పేద, మధ్య తరగతి ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కేంద్రం భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటిం చింది. ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ (పీఎంజీకేఏవై) పేరిట  1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సమాజంలోని నిమ్నవర్గాలకు నగదు, నిత్యావసరాల కొరత రాకుండా చేయడమే దీని ఉద్దేశమని చెబుతూ.. ఇందులో ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు ఆహార భద్రత కూడా ఉంటుందని ఆమె చెప్పారు. ‘వలస కార్మికులు, రోజువారీ కూలీలు ప్రధాన లబ్ధిదారులు. పట్టణ ప్రాంత పేద ప్రజానీకానికీ అన్నీ అందిస్తాం. ఆహారం, రోజువారీ అవసరాలు తీరుస్తాం`-అని కేంద్రం మంత్రి ప్ర‌క‌టించారు. దీంతో దేశ‌వ్యాప్తంగా కూడా కేంద్రంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది!

అయితే, రోజులు గ‌డిచాయి. ఇప్పుడు లాక్‌డౌన్ ఏర్ప‌డి దేశంలో 15 రోజులు గ‌డిచింది. దీంతో ప‌నులు, ఉపాధి దెబ్బ‌తిన్న‌వారికి ఈ ప్యాకేజీ రూపంలో ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం ఏంటి?  కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీలో మీకెంత‌-నాకెంత‌? అనే చ‌ర్చ జోరుగా సాగు తోంది. నిజానికి కేంద్రం చెప్పిన విష‌యాన్ని చూస్తే.. 3 నెలల పాటు అదనంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు. ప్రతీ పేద ఇంట్లోని వారికీ తలకు 1 కిలో చొప్పున ప్రతీ నెలా పప్పుదినుసులు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి 3 నెలలపాటు ఒక్కొక్కరికీ 50 లక్షల ఆరోగ్య బీమా. పారిశుద్ధ్య సిబ్బంది, వార్డు బాయ్‌లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డాక్టర్లు, స్పెషలిస్టులు, ఇతర వైద్య సిబ్బంది దీని కిందకు వస్తారు.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 8.69 కోట్ల రైతులకు ఇచ్చే తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ రూ 2000 నగదు ను ఏప్రిల్‌ మొదటి వారంలోగా వారి ఖాతాల్లో వేసేస్తారు. ఉపాధి హామీ ప‌థ‌కం కింద ఇచ్చే వేతనానికి అదనంగా ప్రతీ కార్మికుడికీ రూ 2000 నగదు. దీని ద్వారా 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు 3 నెలల పాటు అదనంగా రూ 1000 నగదు జన ధన్‌ యోజన కింద 20 కోట్ల మంది మహిళలకు 3 నెలల పాటు అదనంగా రూ 500. ఉజ్వల కింద 3 నెలల పాటు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు.

దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జాతీయ గ్రామీణ పథకం కింద దేశంలోని 63 లక్షల స్వయం సహాయ బృందాలకు రూ 10 లక్షల మేర రుణాలు.. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రుణ పరిమితి రూ 20 లక్షలకు పెంపు. ఇదీ ఇత‌మిత్థంగా కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీలోని కీల‌క అంశాలు. అయితే, వీటిలో ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా పేద‌ల‌కు అందే సౌక ర్యాలు ఎలా ఉన్నాయి? అనే ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు.. ఒక‌వేళ లాక్‌డౌన్ మూడు మాసాల‌వర‌కు అంటే జూన్ 30 వ‌ర‌కు కొన‌సాగితే.. కేంద్రం ప్ర‌క‌టించిన 1.7 ల‌క్ష‌ల కోట్ల ల‌బ్ధిని 130 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు పంచిన‌ట్ట‌యితే.. కేవ‌లం మ‌నిషి ఒక్కింటికి 1300 రూపాయ లుగా తేలింద‌ని అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

దీనిని మూడు భాగాలు చేస్తే.. మూడు నెల‌ల‌కు నెల‌కు రూ. 433 మాత్ర‌మే పేద‌ల‌కు అంద‌నుంది. ఇక‌, గ్యాస్ విష‌యంలో కేంద్రం మ‌సిపూసి మారేడు కాయ‌చేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నాటికివినియోగించ‌ని దీపం ప‌థ‌కం సిలిండెర్ల‌ను పేద‌ల‌కు పంచుతున్నార‌ని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అదేస‌మ‌యంలో రాష్ట్రాల‌కు ఇచ్చే నిధులు ఇస్తూ.. వాటినే క‌రోనా నిదులుగా చూపించ‌డం పైగా ఆర్థిక నిపుణులు పెద‌వి విరుస్తున్నారు. ఏదేమైనా.. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గాక‌గానీ.. రాష్ట్రాలు ఈ విష‌యంలో నోరు విప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news