రాజస్థాన్ లో కొత్తగా మరో 4 ఓమిక్రాన్ కేసులు నమోదు… దేశంలో 42కు చేరిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య

దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరగుతోంది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశంలో 5 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. నేడు మరో 4 కేసులు నమోదయ్యాయి. ఒక్క రాజస్థాన్ రాష్ట్రంలోనే ఈ నాలుగు కేసులను అధికారులు నిర్థారించారు. కాగా ఇప్పటికే రాజస్థాన్ లో 9 ఓమిక్రాన్ కేసులు ఉండగా… తాజాగా ఈ 4 కేసులతో ఆరాష్ట్రంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 13కు చేరింది. బాధితులు భారత్​కు రాగానే ఎయిర్​పోర్ట్​లో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. అందులో కరోనా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో వీరిని ఐసోలేషన్​కు తరలించి.. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఎస్ఎంఎస్ మెడికల్ కళాశాలకు పంపించారు. ఈ రిపోర్టుల్లో ఓమిక్రాన్ ఉన్నట్లు తేలింది. దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 42 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

నిన్న కేరళ, కర్ణాటక, ఛండీగడ్, ఏపీల్లో ఒక్కో ఓమిక్రాన్ కేసు నమోదైంది. దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే…మహారాష్ట్రలో 18, రాజస్థాన్ లో13, కర్ణాటకలో 3, గుజరాత్ లో 3, ఢిల్లీలో 3, కేరళలో ఒకటి, ఏపీలో 1 కేసు నమోదైంది.