Republic Day 2024: ఈ ఏడాది రిపబ్లిక్‌ డే ప్రత్యేకతలు ఇవే.. చీరల ఉత్సవం సహా ఎన్నో

-

రిపబ్లిక్ డే వేడుకలకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఈ ఉత్సవాలకు కేంద్ర బిందువు రాజ్ పథ్. ఇక్కడ భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పోలీసులు, పారామిలిటరీ బృందాలు పాల్గొని ఆకట్టుకునే పరేడ్‌లు జరుగుతాయి.

వికసిత భారత్

రిపబ్లిక్ డే పరేడ్ (Republic Day 2024 parade) జనవరి 26 ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ నుండి కర్తవ్య పథ్ వరకు జరుగుతుంది. సుమారు 77,000 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అందులో 42,000 సాధారణ ప్రజల కోసం కేటాయించారు. ప్రజాస్వామ్య భారతదేశం ముఖ్యమైన లక్షణాలను నొక్కిచెప్పే “వికసిత భారత్”, “భారత్ – లోక్ తంత్రతా కీ మాతృకా” ధీమ్ తో రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఫ్రాన్స్ ప్రెసిడెంట్

ఏడాది భారత్‌లో జరిగే గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జనవరి 25న జైపూర్ విమానాశ్రయానికి చేరుకోనున్న మాక్రాన్.. ఈ పర్యటనలో అంబర్ ఫోర్ట్, జంతర్ మంతర్, హవా మహల్ వంటి ప్రముఖ ప్రదేశాల సందర్శిస్తారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఢిల్లీ చేరుకుంటారు. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. పరేడ్ అనంతరం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి నిర్వహించే ‘ఎట్ హోమ్ ‘ రిసెప్షన్ లో పాల్గొంటారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలు ఇవే..

1.మహిళా త్రివిధ దళాల బృందం

తొలిసారి మేజర్ జనరల్ సుమిత్ మెహతా నేతృత్వంలో మహిళా త్రివిధ దళాల బృందం పెరేడ్‌లో పాల్గొంటోంది. ఈ బృందంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు చెందిన మహిళా సైనికులు ఉంటారు.

2. రిపబ్లిక్ డే పరేడ్లో ఫ్రెంచ్ బృందం

ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దాంతో, ఈ సారి ఉత్సవాల్లో 95 మందితో కూడిన ఫ్రాన్స్ కవాతు బృందం, 33 మంది సభ్యుల బ్యాండ్ బృందం, రెండు రాఫెల్ యుద్ధ విమానాలు, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ బస్ ఏ330 మల్టీ రోల్ ట్యాంకర్ రవాణా విమానం కూడా ఈ వేడుకల్లో పాల్గొంటాయి.

3. ఫ్రెంచ్ మిలటరీ టీమ్‌లో ఆరుగురు భారతీయులు

75వ రిపబ్లిక్ డే పరేడ్‌లో భారత దళాలతో కలిసి కవాతు చేస్తున్న ఫ్రెంచ్ సైనిక బృందంలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. ఫ్రెంచ్ కవాతు బృందం కమాండర్ కెప్టెన్ నోయల్ లూయిస్ ఫ్రెంచ్ బృందంలో ఆరుగురు భారతీయులుంటారని ప్రకటించారు. వీరిలో సీసీహెచ్ సుజన్ పాఠక్, సీపీఎల్ దీపక్ ఆర్య, సీపీఎల్ పర్బిన్ తాండన్, గురువచన్ సింగ్, అనికేత్ ఘర్తిమాగర్, వికాస్ దాస్ ఉన్నారు.

 

4. చీరల ఉత్సవం

ఈ రిపబ్లిక్ డే పెరేడ్ ప్రత్యేకత చీరల ఉత్సవం. ఈ పెరేడ్ సందర్భంగా వివిధ భారతీయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చీరలను ‘అనంత్ సూత్ర’ ఎగ్జిబిషన్ పేరుతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రదర్శిస్తుంది. భారతదేశం నలుమూలల నుండి వచ్చిన సుమారు 1,900 చీరలను ఇక్కడ ప్రదర్శిస్తారు. వీటిని కర్తవ్య పథ్ వెంట చెక్క ఫ్రేమ్ లపై సృజనాత్మకంగా అమర్చారు. వీటిలో ప్రతీ చీరపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను స్కాన్ చేసి ఆ చీర నేత, ఎంబ్రాయిడరీ పద్ధతుల గురించి వివరాలు తెలుసుకోవచ్చు.

5. కృత్రిమ మేథ శకటం

ఈ పెరేడ్ లో కృత్రిమ మేధ (ఏఐ) పాత్రను నొక్కి చెబుతూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక శకటాన్ని ప్రదర్శిస్తోంది. ఈ శకటం కృత్రిమ మేధ గురించి ప్రాక్టికల్‌గా వివరిస్తుంటుంది. పిల్లలకు విద్యాబోధన చేయడానికి ఒక ఉపాధ్యాయుడు విఆర్ హెడ్ సెట్‌ను ఉపయోగించే సన్నివేశాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే, లాజిస్టిక్స్, పశువుల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రను వివరిస్తుంది.

6. చంద్రయాన్ 3

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రదర్శించే శకటం ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రకాశించనుంది. ఇందులో చంద్రయాన్ -3 మిషన్ సాధించిన విజయాలను వివరిస్తారు. చంద్రయాన్-3 ప్రయోగం, ఆ తరువాత అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కావడం తదితర వివరాలను చూపుతుంది.

7.ప్రత్యేక ఆహ్వానితులు

వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సహా సుమారు 13,000 మంది ప్రత్యేక అతిథులను పరేడ్‌కు ఆహ్వానించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పిఎం ఉజ్వల యోజన, పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, పిఎం కృషి సించాయి యోజన, పిఎం ఫసల్ బీమా యోజన తదితర పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు అందులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version