టీడీపీ కొన్ని విషయాల్లో చేసిన పోరాటాలు ఫలించాయి. ముఖ్యంగా కుప్పం రెవెన్యూ డివిజన్ ను చంద్రబాబు సాధించుకున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిని కూడా రెవెన్యూ డివిజన్ గా చేశారు.ఇదే సమయంలో టీడీపీ హయాంలో కూడా జరగని పని పలాస కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. ఇది మాత్రం మంత్రి సీదిరి కృషి ఫలితంగానే జరిగింది. ఇక్కడ టీడీపీ చేసింది ఏం లేదు. కానీ కొన్ని అభ్యంతరాల పరిష్కారంలో మాత్రం టీడీపీ చేసిన ప్రయత్నాలు దాదాపుగా ఫలించాయి. సొంత పార్టీ సభ్యులు చెబితేనే వినని సీఎం ప్రజా పోరాటాలకు మాత్రం బాగానే ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా కొన్ని కీలక సమస్యలు ఉత్తరాంధ్ర కేంద్రంగా తీరాయి. ఇక కార్యాలయాల ఏర్పాటే మిగిలి ఉంది.
కొత్త జిల్లాల ఏర్పాటు ముఖ్యంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఆంధ్రావనిలో సర్వత్రా ఆసక్తిదాయక చర్చ నడుస్తోంది. ఎన్నడూ లేని విధంగా కొత్త జిల్లాల పై కొన్ని అభ్యంతరాలు ఉన్నా అవేవీ పట్టించుకోలేదు. పదహారు వేలకు పైగా అభ్యంతరాలు వచ్చినా కూడా సర్కారు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. కొన్ని చోట్ల పేరు మార్పులపై వచ్చిన అభ్యంతరాలు మాత్రం స్వీకరించి వెంటనే సరిదిద్దింది. ఆ విధంగా బాలాజీ జిల్లా పేరును తిరుపతిగా మార్చింది. అదేవిధంగా విజయనగరం జిల్లాను 2 ముక్కలు చేసింది.
పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ప్రకటించింది.అయితే ఈ పేరుపై అభ్యంతరాలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. దీనిని పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చాలని టీడీపీ పోరాటాలు చేసింది. ప్రజా పోరాటాలు తీవ్రం అవుతున్న తరుణాన ప్రభుత్వం దిగి వచ్చి పేరు మార్పునకు సై అంది.అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిపై ఎన్నోసార్లు ప్రజా పోరాటాలు జరిగాయి. టీడీపీ ఆధ్వర్యంలో కూడా ఆ జిల్లా బాధ్యులు కిమిడి నాగార్జున ఎన్నో సార్లు పోరాటాలు చేశారు.
ఎట్టకేలకు చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోయింది. ఈ రాజాం నియోజకవర్గాన్ని చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ లో కలిపినందుకు అక్కడి ఎమ్మెల్యే కంబాల జోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలాన్ని కూడా విజయనగరంలోనే ఉంచారు.దీనిపై అభ్యంతరాలు ఉన్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఉంచుతూ .. అందులో భాగం అయిన జి.సిగడాం ను మాత్రం విజయనగరంలో కలిపారు. దీంతో ఒక నియోజకవర్గం రెండు జిల్లాలు అన్న విధంగా పరిణామాలు ఉన్నాయి. వీటిపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి.