కిలో బెండకాయ ధర 8500 రూపాయలు.. అవాక్కయ్యారా?

-

మీరే కాదు.. కిలో బెండకాయ ధర రూ.8500 అంటే ఎవ్వరైనా అవాక్కవుతారు. ఇంతకీ ఆ బెండకాయలు భూమి మీదనే పుట్టాయా? లేక ఎక్కడినుంచైనా ఊడిపడ్డాయా? అనే డౌటనుమానం మీకు వచ్చి ఉండొచ్చు. కాని.. అవి ఎక్కడి నుంచి ఊడిపడిన బెండకాయలు కాదు. మార్కెట్ లో దొరికే బెండకాయలే. కిలో 30 నుంచి 40 కి దొరికే ఆ బెండకాయలే రూ. 8500. వామ్మో.. ఇలాగైతే ఇక ఏం తింటాం. ఏం బతుకుతాం అంటూ తొందరపడకండి. దాంట్లో చిన్న మతలబు ఉంది. మరి.. అదేందో తెలుసుకుందాం పదండి.

హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ కు ఓ మహిళ వెళ్లింది. కావాల్సిన సరుకులు తీసుకుంది. బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్లింది. ఇంతలోనే తనకు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూనే క్యాషియర్ కు కార్డు ఇచ్చింది. క్యాషియర్ కార్డును స్వైప్ చేశాడు. డబ్బులు ఆన్ లైన్ లో కట్టయ్యాయి. సరుకులు తీసుకొని ఆమె వెళ్లిపోయింది. అయితే.. ఆ కార్డు ఆ మహిళది కాదు. ఆమె భర్తది. దీంతో బిల్లుకు సంబంధించిన మెసేజ్ ఆమె భర్త సెల్ కు వచ్చింది. ఆ మెసేజ్ చేసి ఆమె భర్త నోరెళ్లబెట్టాడు. ఎందుకంటే.. బిల్లు 11 వేల రూపాయలు అయింది. అంత బిల్లు ఎందుకు చేశావని భార్యకు ఫోన్ చేసి చెడామడా తిట్టేశాడు. దీంతో రెండుమూడు వేల కంటే ఎక్కువ కాని బిల్లు 11 వేలు ఎలా అయిందబ్బా అని వెంటనే సూపర్ మార్కెట్ కు వెళ్లి క్యాషియర్ ను నిలదీసింది. తర్వాత అసలు విషయం తెలుసుకొని ఈమె కూడా అవాక్కయింది.

ఇంతకీ ఏం జరిగింది. రెండుమూడు వేలు రావాల్సిన బిల్లు 11 వేలు ఎలా వచ్చింది.. అంటారా? బిల్లింగ్ వేసేటప్పుడు బెండకాయల ప్యాకెట్ మీద ఉన్న బార్ కోడ్ స్కాన్ కాలేదట. దీంతో ఆ క్యాషియర్ మాన్యువల్ గా ఎంటర్ చేశాడట. అప్పుడు కిలో బెండకాయలు అని కొట్టబోయి.. రెండు సున్నాలు ఎక్కువ పడ్డాయట. దీంతో కిలో బెండకాయల ఖరీదు రూ.8500 అయిందట. తమ తప్పును తెలుసుకున్న సూపర్ మార్కెట్ సిబ్బంది వెంటనే ఎక్కువ బిల్ వేసిన డబ్బులను సదరు మహిళకు తిరిగి ఇచ్చేశారట. ఇదీ అసలు సంగతి.

అయితే.. ఈ ఘటన మనకు ఓ మంచి గుణపాఠం కావాలి. చాలా మంది బిల్లింగ్ సమయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తారు. బిల్లు సరిగా చూసుకోరు. పిన్ నెంబర్ కూడా క్యాషియర్లకు చెబుతారు. కొంతమంది రాసిస్తారు. బిల్లు ఎంతయిందో కూడా సరిగా చెక్ చేసుకోరు. ఫోన్లలో బిజీగా ఉంటారు. ఇలా చేస్తే ఇటువంటి ఘటనలే పునరావృతం అవడమే కాదు.. ముఖ్యమైన కార్డు డిటేయిల్స్ అన్నీ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఎవ్వరినీ నమ్మకూడదు. ముఖ్యంగా కార్డు ద్వారా పేమెంట్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దీని ద్వారా అయినా అర్థమయి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news