తప్పిపోయిన పిల్లి కోసం 25 రోజులు వెతికారు.. కానీ?

-

ఊరు కాని ఊరు.. భాష రాదు.. అయినా కూడా వాళ్లు ప్రాణంగా ప్రేమించుకున్న పిల్లి కోసం ఆ జంట పడ్డ ఆరాటాన్ని చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు. రేణిగుంట పరిసర ప్రాంతాల్లో పిల్లి గురించే చర్చ.

వాళ్లది గుజరాత్ లోని సూరత్. తిరుపతి వెంకన్న దర్శనం కోసం తిరుపతికి వచ్చారు. పిల్లలు లేకపోవడంతో.. వాళ్ల లోటును తీర్చుకోవడం కోసం ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. అదే వాళ్ల సర్వస్వం. వాళ్లు ఎక్కడికెళ్తే.. అక్కడికి దాన్న కూడా తీసుకెళ్లేవారు. తిరుమలకు వచ్చినప్పుడు కూడా దాన్ని తీసుకొచ్చారు. గత నెల 9న తిరుపతికి వచ్చారు. వెంకటేశ్వరస్వామి వారి దర్శనం తర్వాత గత నెల 13న తిరుగు ప్రయాణం అయ్యారు. రేణిగుంట రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు.

తమ రైలు కోసం వేచి చూస్తున్న సమయంలో పిల్లిని పడుకోపెట్టిన బాస్కెట్ మిస్సయింది ఎవరు తీశారో తెలియదు. పిల్లి కోసం స్టేషన్ అంతా గాలించారు. పిల్లి జాడ మాత్రం దొరకలేదు. గుజరాత్ వెళ్లే రైలు వచ్చినప్పటికీ.. వాళ్లు రైలులో వెళ్లలేదు. తమ పిల్లి కోసం వెతుకుతూనే ఉన్నారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పిల్లిని వెతకడమేంటని అదోలా చూశారు.

దాని కోసం గత 25 రోజులుగా రేణిగుంట చుట్టు పక్కన ప్రాంతాలన్నీ వెతికారు. కానీ.. తమ పిల్లి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇక దాని మీద ఆశలు చాలించుకొని తమ ప్రాంతానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఎవరికైనా పిల్లి ఆచూకి తెలిస్తే.. 9824876542 నెంబర్ కు ఫోన్ చేయాలంటూ అక్కడి స్థానికులకు తమ నెంబర్ ఇచ్చి వెళ్లారు. తమ పిల్లి ఆచూకీ తెలిపిన వారికి 20 వేల బహుమానం కూడా ఇస్తామని చెప్పి విషాద వదనంతో అక్కడి నుంచి తిరుగుప్రయాణమయ్యారు.

ఊరు కాని ఊరు.. భాష రాదు.. అయినా కూడా వాళ్లు ప్రాణంగా ప్రేమించుకున్న పిల్లి కోసం ఆ జంట పడ్డ ఆరాటాన్ని చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు. రేణిగుంట పరిసర ప్రాంతాల్లో పిల్లి గురించే చర్చ. అయితే.. ఆ పిల్లి ఏమైంది అనే విషయం మాత్రం తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Latest news