ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం జరిగింది. 13వ వార్డులో చెక్క వంతెన వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి కొందరు ఆగంతకులు మీసాలు, నామాలు, బొట్లు పెట్టారు.
నందమూరి తారకరామారావు.. ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయాల్లోనూ తిరుగులేని వ్యక్తిగా నిలిచారు. ప్రజలకు సేవ చేయడం కోసం.. ప్రజల కష్టాలను తీర్చడం కోసం ఆయన పార్టీ పెట్టి.. రాజకీయాల్లోకి వచ్చి.. రాజకీయాల్లోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా.. ఎప్పుడూ ప్రజల కోసం పరితపించిన వ్యక్తి ఆయన. అయితే.. తర్వాత ఆయన పార్టీ పగ్గాలు వేరే చేతుల్లోకి వెళ్లడం.. ఆ తర్వాత ఆయనకు చేసిన మోసాన్ని తట్టుకోలేక కుంగిపోయారు. అలాగే అనారోగ్యం పాలయి అందరినీ వదిలేసి వెళ్లిపోయారు.
ఆయన భౌతికంగా లేనప్పటకి.. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారు. అందుకే.. ఆయనకు నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించారు.
అయితే.. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం జరిగింది. 13వ వార్డులో చెక్క వంతెన వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి కొందరు ఆగంతకులు మీసాలు, నామాలు, బొట్లు పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం.. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే.. ఎన్టీఆర్ విగ్రహానికి మీసాలు, నామాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ఎవరు చేశారు ఈ పని.. వాళ్ల ఉద్దేశం ఏంటి.. కావాలని చేశారా? లేక ఆకతాయిల పనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.