సొమ్మారాయ్ ఐల్యాండ్ వాసులు జూన్ 13వ తేదీన సమావేశమై తమ ప్రాంతాన్ని టైమ్ ఫ్రీ జోన్ గా మార్చాలని తీర్మానించారు. ఈ మేరకు ఆ ఐల్యాండ్‌లో నివసించే 300 మంది ఓ పిటిషన్‌పై సంతకం కూడా పెట్టారు.
నిత్యం మనం ఏ పనైనా సరే టైముకు చేస్తాం. ఉదయం ఫలానా టైముకు లేవాలని అలారం పెట్టుకున్నది మొదలు రాత్రి నిద్రించే వరకు మనం టైముకు చేస్తుంటాం. కాకపోతే కొంత సమయం అటు, ఇటు అవుతుంటుంది లెండి.. అది వేరే విషయం. అయితే రోజూ మనం ఏ పనిచేసినా దానికి టైముతో లింక్ అయి ఉంటుంది. అంటే పాఠశాలలకు, కాలేజీలకు, ఆఫీసులకు, ఇతర పనుల కోసం మనం ఫలానా టైం అని కేటాయిస్తే ఆ టైముకు ఆ పనులను మనం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టైముతో తంటా ఎందుకని అనుకున్న ఆ ఐల్యాండ్ వాసులు తమ ప్రాంతాన్ని ఏకంగా టైమ్ ఫ్రీ జోన్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆ ఐల్యాండ్ ఏదో తెలుసా..?
నార్వేలోని సొమ్మారాయ్ అనే ఐల్యాండ్ పచ్చని ప్రకృతి వాతావరణానికి నెలవు. ఆహ్లాదకరమైన బీచ్‌లు, పచ్చని పర్వతాలు, మైదానాలు.. ఎటు చూసినా ప్రకృతి రమణీయత ఆ ప్రాంతమంతా ఉట్టిపడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో నవంబర్ నుంచి జనవరి వరకు చీకటి ఉంటుంది. సూర్యుడు రాడు. అలాగే మే 18 నుంచి జూలై 26వ వరకు సూర్యుడు ఉంటాడు. చీకటి రాదు. దీంతో ఈ ప్రాంతంలో 5, 6 నెలల పాటు సూర్యోదయం, సూర్యాస్తమయంలలో ఉన్న అసమానతల వల్ల తమకు సమయంతో పనేముంది అనుకున్న అక్కడి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు.
సొమ్మారాయ్ ఐల్యాండ్ వాసులు జూన్ 13వ తేదీన సమావేశమై తమ ప్రాంతాన్ని టైమ్ ఫ్రీ జోన్ గా మార్చాలని తీర్మానించారు. ఈ మేరకు ఆ ఐల్యాండ్‌లో నివసించే 300 మంది ఓ పిటిషన్‌పై సంతకం కూడా పెట్టారు. దీనికి త్వరలో ఆమోదం లభిస్తే ఇకపై ఈ ఐల్యాండ్ టైమ్ ఫ్రీ జోన్ అవుతుందన్నమాట. అంటే.. ఇకపై ఈ ఐల్యాండ్‌లో ఉండే వారు సమయాన్నిపాటించాల్సి పనిలేదు. తమ ఇష్టం వచ్చిన పనిని ఎప్పుడైనా చేయవచ్చు. అందుకు సమయంతో పనిలేదు. అయితే ఒక వేళ నిజంగానే ఈ ఐల్యాండ్ టైమ్ ఫ్రీ జోన్ అయితే ప్రపంచంలోనే సమయంతో పనిలేకుండా ఉండే ఐల్యాండ్‌గా ఈ ప్రాంతం రికార్డులకెక్కుతుంది.. మరి ఆ ఐల్యాండ్ వాసుల నిర్ణయానికి ఆమోదం లభిస్తుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!