పాక్‌లో వేలాది టీవీలు బద్దలు.. వీడియోలు

944

ప్రపంచకప్‌ క్రికెట్‌లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లో తమ దేశం ఘోర పరాభవం దిశగా సాగుతూండడాన్ని భరించలేని పాకిస్తాన్‌ అభిమానులు, మ్యాచ్‌ జరుగుతూండగానే తమ టీవీలను బద్దలు కొట్టారు. పాకిస్తాన్‌ జట్టు పేలవ ప్రదర్శన వారిని తీవ్ర అసహనానికి గురిచేసింది.

పాకిస్తాన్‌లో రాత్రినుంచి వేలాది టీవీలు మూగబోయాయి. ప్రపంచకప్‌కే ఫేవరేట్‌ మ్యాచ్‌గా ప్రపంచమంతా పరిగణించిన ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ నిన్న మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫర్డ్‌ స్టేడియంలో జరిగింది. వరుణుడి భయం ఒళ్లంతా అవరించిన అభిమానులు వర్షం పడకూడదని పూజలు చేసారు. పూజలు ఫలించాయో ఏమోగానీ, వరుణుడు పెద్దగా భయపెట్టలేదు. మ్యాచ్‌ దాదాపుగా సజావుగానే సాగినట్టు లెక్క. అయితే ప్రపంచకప్‌లో ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా పాకిస్తాన్‌ భారత్‌ చేతిలో ఘోరపరాజయం పాలైంది.

టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌, ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌ చేయాల్సిందిగా ఆహ్వానించడంతో, ఇండియా వ్యూహాత్మకంగా బ్యాటింగ్‌ ఆరంభించింది. అది ఊహించని పాక్‌, వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తూ, భారత భారీ స్కోరుకు సహకరించింది. ఎప్పుడైతే ఇండియా 337 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందో అప్పుడే పాకిస్తాన్‌ సగం ఓడిపోయింది. ఫీల్డింగ్‌లో చేసిన అతిపెద్ద తప్పులకు పాక్‌ భారీమూల్యం చెల్లించాల్సివచ్చింది.

పాకిస్తాన్‌లో మ్యాచ్‌ సందర్భంగా, ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఇందుకు పాక్‌ సైన్యం కూడా మినహాయింపు కాదు. స్వయంగా దేశాధినేత, మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ కూడా ఇదేపనిలో ఉన్నాడు. తీరా, తమ దేశం దారుణంగా ఆడుతుండడం, ఓటమి దిశగా పయనించడం, ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిస్తున్న కోట్లాదిమంది పాక్‌ అభిమానులకు అస్సలు రుచించలేదు. వారి తీవ్ర ఆగ్రహావేశాలకు వేలాది టీవీలు బలయినట్లు సమాచారం. సోషల్‌ మీడియాలోనైతే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇస్లామాబాద్‌, కరాచీ, పెషావర్‌ లాంటి నగరాల్లో జనం ఇవాళ వీధుల్లోకి వచ్చి, హంగామా సృష్టించారు. జట్టు మొత్తాన్ని మార్చాలని డిమాండ్‌ చేశారు. మ్యాచ్‌ మధ్యలో, పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ ఆవలించడంతో దేశం మొత్తానికి చిర్రెత్తుకొచ్చింది. ఓ పక్క పరిస్థితి బాగాలేదని టెన్షన్‌తో చస్తుంటే, ఈయనగారికి ఆవలింతలెలా వస్తున్నాయో అర్థం కావడం లేదని ఓ అభిమాని వాపోయాడు. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో తీవ్రదుమారం లేపింది. చాలా ప్రాంతాల్లో జనం తమ టీవీలు బద్దలు కొట్టారని పాక్‌ మీడియా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా విడుదలయ్యాయి.

READ ALSO  తెలంగాణ రెండో ముఖ్యమంత్రి కూడా కేసీఆరేనా..?... ఇంకా నెల రోజుల్లో తేలిపోనుంది...!

కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడిపోవడాన్ని పండుగ చేసుకుంటున్న వాళ్లలో భారత అభిమానులతో పాటు, టీవీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఉన్నపళాన, తమ టీవీల అమ్మకం ఆకాశంలోకి చేరుతుందని వారి ఆశాభావం. అది నిజం కూడా. ఏదో ఆవేశంలో టీవీలు పగులగొట్టినా, మళ్లీ టివీ అయితే కావాలికదా. మ్యాచ్‌ల సంగతి దేవుడెరుగు, రోజువారీ కార్యక్రమాలను ఎంజాయ్‌ చేయాలన్నా, సినిమాలు చూడాలన్నా, టీవీలు లేకపోతే, ఇంట్లో ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు.