తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం బతుకమ్మ.. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి చిహ్నం బతుకమ్మ.. ప్రకృతికి, మనిషికి గల మధ్య సంబంధానికి ప్రతీక బతుకమ్మ.. తెలంగాణలో బతుకమ్మకు, దసరాకు ఉన్న ప్రాధాన్యం మరే పండగకూ ఉండదు. సాధారణంగా ఎక్కడైనా పూలతో దేవుడిని పూ జించడం సంప్రదాయం… కానీ, పూలనే దేవుడిగా పూజించడం ఈ పండుగ ప్రత్యేకం. చిన్నాపెద్దా, పేద, ధనిక, పల్లె, పట్నం అనే భేదంలేకుండా ప్రతీ ఒక్కరూ అంత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతు కమ్మ..
తొమ్మిది రోజులపాటు పూలనే దేవతలుగా పూజించే సంప్రదాయం ఇక్కడి మహిళలది. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, భక్తిశ్రద్ధలతో పాటలుపాడుతూ వేడుకలు జరుపుకోవడం మరెక్కడా కనిపించదు. మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మలో పురుషులకు స్థానం ఉండదు. తెలంగాణలో పూజలందుకునే సమ్మక్క-సారక్క, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, బతుకమ్మ ఇలా అందరూ ఒకప్పుడు పురషాధిక్కతను ఎదురించి పోరాడిన రూపాలే.. అందుకోసమే తెలంగాణలో బతుకమ్మ పండుగకు అంతటి ప్రాధాన్యం ఉంది.
ఆశ్వయుజ మాసం శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మను వేడుకగా జరుపుకుంటారు. రంగురంగుల పూలను త్రికోణాకృతిలో పేర్చి, అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ , వలయంగా తిరుగుతూ మహిళలు పాడే పాటలు మనసుకు హత్తకుంటాయి. తొలిరోజు బతుకమ్మను ఎంగిలపూల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. వీటిలో దేని ప్రత్యేకత దానిదే… ఇలా తొమ్మిది రోజులు ఆడిన బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ సంప్రదాయం ఎప్పడి నుంచి ఎలా మొదలైందో చెప్పడానికి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.