తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం బతుకమ్మ.. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి చిహ్నం బ తుకమ్మ.. ప్రకృతికి, మనిషికి గల మధ్య సంబంధానికి ప్రతీక బతుకమ్మ.. తెలంగాణలో బతుకమ్మకు, ద సరాకు ఉన్న ప్రాధాన్యం మరే పండగకూ ఉండదు. సాధారణంగా పూలతో దేవుడిని పూజించడం సంప్రదాయం… కానీ, పూలనే దేవుడిగా పూజించడం ఈ పండుగ ప్రత్యేకం. చిన్నాపెద్దా, పేద, ధనిక, పల్లె, పట్నం అనే భేదంలేకుండా ప్రతీ ఒక్కరూ అంత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ..
ఈపండుగ వర్షాకాలం చివరలో, శీతాకాలపు తొలి రోజుల్లో బతుకమ్మ పండగ వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రకరకాల పూలు, రంగురంగుల ఆరు బయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు, తంగేడు ఈకాలంలో సంవృద్ధిగా లభిస్తాయి. బంతి, చేమంతి, నందివర్థనంలాంటి పూలు కూడా ఇదే సమయంలో పూస్తుంటాయి. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. అలాగే జొన్నపంట కోతకు సిద్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అత్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ, బతుకమ్మ పండుగను జరపుకోవడం ఆనవాయితీ.
తంగేడు, గూనుగుతోపాటు రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మ ఆకారాలను చూస్తే..లింగం, భూమి , గర్భం, ధాన్యరాశి ఆకారాలు కనిపిస్తుంటాయి. పూలన్నింటినీ గర్భాకారంలో పేర్చి, ఆడిపాడి, పునసృష్టికి స్వాగతం పలకడం ఈ పండుగ అంతరార్థంలో కనిపిస్తుంది. మనిషి పుట్టుకకు మూలమైన గర్బాన్ని పూజించడం, గౌరవించడం జానపథుల సంసృతి. బతుకమ్మను గర్భానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి, గర్భపూజను, మాతృమూర్తి పూజించడమే బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు కొనసాగే నిర్వహించే బతుకమ్మ పండుగను నవమాసాలకు ప్రతీకగా చెబుతుంటారు.
ఈ కారణంగానే బతుకమ్మ పండుగ మహిళలల సంతాన సాఫల్య తకు సంబంధించిన పండుగ అని కూడా పేర్కొంటారు. పూలన్నింటినీ, గర్భాకారంలో పేర్చి, ఆడి, పాడి, పూజించి, పునసృష్టికి స్వాగతం పలకడం ఈ పండుగ విశిష్టత. మహిళలకు , ప్రకృతితో ఉన్న అనుబంధానికి ఈ బతుకమ్మ పండుగ అద్దం పడుతుంది. అందుకే బతుకమ్మ పండుగను ప్రకృతి పండుగగా, భూదేవి పండుగగా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే ప్రకృతి, భూదేవి రెండూ పునరుత్పత్తి రూపాలే.