ప్రత్యేక పర్వ దినాల్లో ఉపవాసం ఉంటారు..ఒక్కోక్కరు ఒక్కోలా ఉపవాసం చేస్తారు.కొంతమంది రోజంతా ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటుంటారు.ఉపవాసం పేరుతో అలా కడుపు మాడ్చుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడతామంటున్నారు పోషకాహార నిపుణులు. నిర్ణీత వ్యవధుల్లో సాత్వికాహారం తీసుకుంటూ అటు శరీరానికి శక్తిని అందిస్తూనే, ఇటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో అమ్మవారిని కొలిచే అతివలు ఆరోగ్యానికి లోటు లేకుండా, ఉత్సాహం తగ్గకుండా ఉపవాసం ఉండాలంటే కొన్నిటిని తెలుసుకోవాలి..
మనం లేవగానే మన శరీరంలోని మలినాలను బయటికి పంపించాలి.. అప్పుడే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. అలాగే జీవక్రియలూ చురుగ్గా మారతాయి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పటికీ ఉదయం లేవగానే నిమ్మరసం కలిపిన గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగాలి. ఆపై ఏదైనా హెర్బల్ టీ తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం మరీ మంచిది. ఇక దీని తర్వాత నానబెట్టిన నట్స్, గింజలు లేదంటే ఏదైనా పండు తినచ్చు..
ఇకపోతే ఉపవాసం సమయంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నీళ్లు తాగడం, మధ్యమధ్యలో మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, నిమ్మరసం-తేనె కలిపిన నీళ్లు తీసుకోవడం మంచిది. వీటితో పాటు కీరా, టొమాటో వంటి కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు తగ్గకుండా కాపాడుకోవచ్చు. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండడంతో పాటు ఇతర అవయవాల పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు..
ఆరోగ్యంగా ఉండే వారు ఉపవాసం వుంటే మంచిదే..కానీఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భం ధరించిన మహిళలు ఈ పండగ సమయంలో ఉపవాసం ఉండకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఉపవాసం వల్ల సరైన సమయానికి ఆహారం అందక.. వారికి రక్తంలో చక్కెర స్థాయులు పడిపోయే అవకాశం ఉంది. తద్వారా లేనిపోని అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఉపవాసం జోలికి పోకుండా కడుపునిండా పోషకాహారం తీసుకోవడంతో పాటు నిపుణులు చెప్పినట్లుగా ఆరోగ్యవంతమైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ దసరాను సంతోషంగా జరుపుకోవచ్చు..