చేపలతో మనం అనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. చేపల వేపుడు, పులుసు, పులావ్, బిర్యానీ.. ఇలా అనేక రకాల వంటకాలను మనం చేసుకుని ఆరగించవచ్చు. అయితే సాధారణంగా మనకు చేపలతో చేసే అపోలో ఫిష్ రెస్టారెంట్లలోనే లభిస్తుంది. కానీ కొద్దిగా శ్రమిస్తే.. అపోలో ఫిష్‌ను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అపోలో ఫిష్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
అపోలో ఫిష్ తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు:
కరివేపాకు – 2 రెమ్మలు
పచ్చిమిరప కాయలు – 3
నూనె – తగినంత
అల్లం, వెల్లుల్లి తరిగిన ముక్కలు – 1 టీస్పూన్
పసుపు – 1/4 టీస్పూన్
ఎండు కారం – 1 టీస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
కోడిగుడ్డు – 1
ఆల్ పర్పోస్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్
కార్న్ స్టార్చ్ – 1 టేబుల్ స్పూన్
కొర్రమీను చేపలు (ముక్కలు) – 250 గ్రాములు
పచ్చిమిరపకాయల పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
సోయా సాస్ – 1 టీస్పూన్
పెరుగు – 1/4 కప్పు
నల్ల మిరియాల పొడి – 1/2 టీస్పూన్
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
అపోలో ఫిష్ తయారు చేసే విధానం:
ఒక పాత్రలో చేప ముక్కలను తీసుకుని అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, నిమ్మరసం వేసి చేప ముక్కలను బాగా కలపాలి. అనంతరం అందులో కోడిగుడ్డు కొట్టి, కార్న్ స్టార్చ్, ఆల్ పర్పోస్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత చేప ముక్కలను మీడియం మంటపై డీప్ ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఫ్రై అయిన చేప ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పాన్ తీసుకుని నూనె వేసి వేడెక్కాక అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరప కాయ ముక్కలు, కరివేపాకులు, పచ్చిమిరపకాయ పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, సోయా సాస్, పెరుగు, మిరియాల పొడి, కొత్తిమీర ఆకులు వేసి కొంత సేపు వేయించాలి. అనంతరం అందులో అంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి బాగా వేయించాలి. అనంతరం ముక్కలపై నిమ్మరసం పిండాలి. దీంతో రుచికరమైన అపోలో ఫిష్ తయారవుతుంది..!