హైదరాబాదీ స్పెషల్ డబుల్ కా మీటా ఎలా తయారు చేయాలో తెలుసా?

Hyderabadi Double Ka Meeta

నాన్ వెజ్ వంటకం ఏదైనా తిన్న తర్వాత కొంచెం స్వీట్ ఏదైనా తింటే ఉంటది మజా మామూలుగా ఉండదు కదా. అయితే.. డెజర్ట్ గా డబుల్ కా మీటా అయితే ఎలా ఉంటది. వావ్.. పేరు వింటనే నోరూరుతోందంటారా? అవును.. ఇన్ స్టంట్ గా క్షణాల్లో చేసుకోవచ్చు ఈ వంటకాన్ని. మరి.. ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా?

దానికి తెల్ల బ్రెడ్ ముక్కలు కొన్ని తీసుకోండి. కొన్ని చిక్కని పాలు, కొంచెం చక్కెర, పెరుగు మీగడ, నెయ్యి, బాదాం పప్పు, పిస్తా, కుంకుమ పువ్వు ఉంటే చాలు… వేడి వేడిగా డబుల్ కా మీటాను తయారు చేసుకొని లాగించేయొచ్చు.

ముందుగా ఓ గిన్నెలో ఓ కప్పు పాలు పోసి బాగా మరిగించండి. తర్వాత మరో గిన్నెలో కప్పు చక్కెర వేసి కొన్ని నీళ్లు పోసి మరిగించండి. బాగా పాకానికి వచ్చేంతవరకు ఆగండి. ఇంతలో బ్రెడ్ ముక్కలను మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. నెయ్యితో వాటిని కాల్చండి. పక్కన పెట్టుకోండి. ఇక.. పాలు మరిగాక పాలల్లో మీగడ వేయండి. చక్కెర పాకంలో బ్రెడ్ ముక్కలు వేయండి. చిక్కగా మరిగిన పాలను ఆ బ్రెడ్ ముక్కల్లో పోయండి. తర్వాత చిన్నగా తరిగిన బాదం ముక్కలు చల్లి కొంచెం సేపు అలాగే మంట మీద ఉంచండి. ఓ పదినిమిషాల తర్వాత అవన్నీ మిక్స్ అయి.. నెయ్యి పైకి తెలుంది. దీంతో డబుల్ కా మీటా రెడీ అయినట్టే. తర్వాత కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకొని ప్లేట్ లో వేసుకొని లాగించేయడమే.