మంచి నిద్రకు గొప్ప పానీయాలు (మందు కాదండోయ్‌.!)

-

నిద్ర.. మనిషికి ఒక గొప్ప బహుమతి. ఒక మంచి ‘రేపటికి’ ఈ రాత్రి పునాది. ఎన్నో అనుభూతులు, స్వప్నాలు కలబోసిన ప్రయాణం. నవ్వులు, బాధలు, సంతోషాలు, కన్నీళ్లు, కోపాలు, భయాలు ఆ కాసేపు మన భాగస్వాములు. వీటన్నింటినీ క్లియర్‌ చేసి, మనల్ని మళ్లీ ‘చార్జ్‌’ చేసి, ఒక ఫ్రెష్‌ మార్నింగ్‌తో నిలబెడుతుంది నిద్ర. అటువంటి నిద్ర నేడు ఎంతమందికి లభిస్తోంది? పడుకునేది పది గంటలైనా, సుఖనిద్ర ఎన్ని గంటలు?

నిద్రాసమయం.. శరీరంలో పొద్దున జరిగిన మానసిక, శారీరక అలసటలను దూరం చేసే కాలం. నష్టపోయిన శక్తిని, రోగనిరోధకతత్వాన్ని, కండరాలు, నాడులు, ఎముకలను తిరిగి పూర్వ, పటుత్వ స్థితికి తీసుకొచ్చే సమయం. ఒకరకంగా శరీరానికి ‘మెయిన్‌టెనెన్స్‌’ జరిగే టైం. ఈ సమయంలో మస్తిష్కం తక్కువస్థాయిలో పనిచేసిప్పటికీ, చాలా చలాకీగా ఉంటుంది. నిజానికి మెలకువగా ఉన్నప్పటికంటే, నిద్రలోనే మెదడు కొన్నిసార్లు యాక్టివ్‌గా ఉంటుందని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ తేల్చింది. గుండె కొట్టుకోవడం, రక్తప్రసరణ, శ్వాసక్రియలు, ఉష్ణోగ్రత లాంటివి మాత్రం నెమ్మదిగా, ఒక పద్ధతిలో జరుగుతుంటాయి.


కొన్ని ముఖ్యమైన రిపేర్లు, కణజాల అభివృద్ధిలాంటి కార్యక్రమాలు పూర్తిచేసి, పూర్వపు ఉత్సాహంతో దేహాన్ని రేపటికి సిద్ధంగా ఉంచుతుంది. అటువంటి నిద్రను నేడు మానవుడు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. మారుతున్న జీవనశైలి మానవజీవితాన్ని ప్రమాదంలో పడేస్తోంది. ఆలోచనలు, ఒత్తిడి, అలసటలు రకరకాల నిద్రలేమి సమస్యలకు కారణభూతమవుతున్నాయి. తద్వారా ఇతర శారీరక, మానసిక సమస్యలకు లోను కావాల్సివస్తోంది.

కాబట్టి మన శారీరక-మానసిక ఆరోగ్యానికి నిద్రను ఒక వరంగా పరిగణించాలి. నిద్రకు గౌరవం ఇవ్వాలి. మన మనుగడకు ఆహారం, నీరు, గాలీ ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం. ప్రతి మనిషి 7 నుండి 8 గంటలను నిద్రకు తప్పకుండా కేటాయించాలి. నిద్రలేమిని ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. రకరకాల కారణాలతో ఈ నిద్రలేమి మనుషులను బాధిస్తూఉంటుంది. అయితే పెద్దగా ఇటువంటి సమస్యలు లేనివారు, ఆరోగ్యకరమైన నిద్ర పొందడానికి ప్రయత్నం చేయాలి. మనకు ఈ విషయాలు తెలియక, నిద్ర టైంలో చేయకూడనివి చేస్తుంటాం. దాంతో మంచి నిద్రకు దూరమై, మరుసటిరోజు కూడా పూర్తిగా పాడవుతుంది. భోజనం చేసిన వెంటనే పడుకోవడం, టీవీ చూడ్డం, కాఫీ తాగడం… అన్నింటికంటే ముఖ్యంగా మందేయడం.

ఇవన్నీ నిద్రకు చేటు తెచ్చేవే. ఆల్కాహాల్‌ పట్ల చాలా అపోహలున్నాయి. ఓ పెగ్గేస్తేనో, ఓ బీర్‌ లాగిస్తేనో, మంచిగా నిద్ర పడుతుందని చాలామంది భ్రమ పడుతుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఆల్కాహాల్ వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. నిద్రాసమయం ఆసన్నమైనప్పుడు సహజంగా మెదడు ‘మెలటోనిన్‌’ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మనల్ని నిద్రపుచ్చడానికి ఉపయోగపడుతుంది. ఆల్కాహాల్‌ వల్ల దీని ఉత్పత్తి దెబ్బతింటుంది. దాంతో తాగినమత్తు వదలగానే, మెలకువ రావడం, తలనొప్పి, చికాకులాంటి సమస్యలు మొదలవుతాయి. మామూలుగా నిద్రపోయి, పొద్దున్నే లేవగానే చాలా ఫ్రెష్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. మందేస్తే, ఓ మంచి ఉదయం మిస్సవుతాం. అయితే మంచి నిద్ర పట్టడానికి వేరే పానీయాలు కూడా ఉన్నాయి. వాటి బదులు వీటిని తీసుకుంటే చాలా బెటర్‌.

1. పాలు


పాలు నిజంగా అమృతమే. ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం పాలు. భారత ఆయుర్వేద విజ్ఞానశాస్త్రం తెలిపిన దాని ప్రకారం, గాఢనిద్రకు గోరువెచ్చని పాలు ఎంతో ఉపకరిస్తాయి. ఆధునిక శాస్త్ర ప్రకారం కూడా, నిద్రలేమికి ప్రధానకారణం కాల్షియం లోపం. పాలల్లో పుష్కలంగా కాల్షియం లభించడంతో పాటు, మానసిక ప్రశాంతత, ఉల్లాసాన్ని కలిగించే ఒక ప్రత్యేక రసాయనం ‘సెరొటోనిన్‌’ కూడా ఉంటుంది. ఇవి రెండు సుఖనిద్రకు చాలా దోహదపడతాయి. నిద్రపోయేముందు పాలు తాగడం అలవాటు చేసుకోండి.

2. కొబ్బరినీళ్లు:


2006లో చేసిన ఒక పరిశోధన ప్రకారం, మెగ్నీషియం లోపం మనిషిలో కుంగుబాటును, ఆత్రుతను పెంచుతుంది. ఇవి మనకు నిద్ర పట్టకుండా చేస్తాయి. కొబ్బరినీళ్లలో మెగ్నీనిషియం విరివిగా లభిస్తుంది. పడుకునేముందు కొబ్బరినీళ్లు తాగితే మనసు నెమ్మదించి, ప్రశాంతత లభిస్తుంది. తద్వారా మంచి నిద్రపట్టే అవకాశముంటుంది.

3. అరటిపండ్ల మిల్క్‌షేక్‌ (బనానా షేక్‌):


అరటిపండ్లు ఇష్టపడనివారు బహుశా ఎవరూ ఉండరు. మామూలుగానే చాలామందికి పొద్దున్నే పాలల్లో అరటిపండు కలుపుకుని తినే అలవాటుంటుంది. దీన్ని కాస్తా రాత్రికి మార్చి, మిల్క్‌షేక్‌లా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అరటిపండ్లలో పుష్కలంగా ఉండే పోటాషియం, మెగ్నీషియంతో పాటు, ‘ట్రిప్టోఫాన్‌’ అనబడే ఒక అమినోయాసిడ్‌ కూడా ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్‌ కూడా పాలల్లో ఉండే సెరొటోనిన్‌ను తయారుచేస్తుంది. పాలతో కలపడం వల్ల సెరొటినిన్ ఎక్కువగా లభించి, మంచి నిద్ర పడుతుంది. పాలల్లో అరటిపండు ముక్కటు వేసి, కొంచెం తేనె గానీ, పంచదార కానీ కలిపి మిక్సీ పట్టేస్తే, ఎంతో రుచికరమైన బనానా మిల్క్‌షేక్‌ రెడీ. ఇంకెందుకు ఆలస్యం?

4. బాదంపాలు


బాదంపప్పులు, బాదంపాలు తెలియనివారుండరు. వేసవికాలంలో బయట బండ్లమీద, స్వీటుషాపుల్లో అమ్మే బాదంపాలు చాలామంది తాగుంటారు. సరే… అది ఎటువంటి వాతావరణంలో తయారుచేస్తారో మనకి తెలియందికాదు. దాన్నే మనమే స్వయంగా చేసుకుంటే పోలా..! బాదంపాలల్లో ఎన్నో విలువైన పోషకాలున్నాయి. డిప్రెషన్‌, టెన్షన్‌లను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఆ పాలల్లో కొంచెం కుంకుమపువ్వు వేస్తే పరిపూర్ణం. కుంకుమపువ్వులో నాడీవ్యవస్థను సక్రమంగా నియంత్రించే రసాయనముంటుంది. బాదంపాలల్లో కలిసినప్పుడు ఇంకా చాలా ప్రభావవంతంగా మారుతుంది. నిద్రకు ముందు ఇది కూడా దివ్వమైన పానీయం.

5. చామంతి చాయ్‌:

ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. గడ్డిచామంతి తెలుసు కదా. దాన్నే వాడాలి మనం. రెండు మూడు పూలు తెంపి, నీళ్లలో మరిగించి తయారుచేసేదే చామంతి చాయ్‌. చాలా పవర్‌ఫుల్‌ అండోయ్‌. కొంచెం తేనె కలుపుకున్నా పరవాలేదు. ఏం లేకుండా తాగితే ఇంకా బెటర్‌. చామంతిలో అపిజెనిన్‌ అనే ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది నిద్రను బాగా ప్రోత్సహిస్తుంది.

అయితే, పైన తెలిపిన పానీయాలన్నీ కూడా కేవలం నిద్ర కోసమే కాకుండా స్వభావరీత్యా కూడా ఇతర ఆరోగ్యకరమైన పోషకాలను కలిగిఉంటాయి. అవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని రక్షించడానికి ఎంతో కృషిచేస్తాయి. కాబట్టి వీటిని మీరు ప్రయత్నిస్తే చాలా మంచిది. కాఫీలు, టీలు, ఆల్కహాల్‌, పంచదార పానీయాలు నిద్రకుముందు సేవిస్తే, అవి శరీరంలో శక్తిస్థాయిని పెంచి నిద్రపట్టకుండా చేస్తాయి. అందుకని వాటిని వదిలేసి, పైన తెలిపిన పానీయాలను తీసుకుంటే ఒక మంచిరోజు రేపు మీకోసం ఎదురుచూస్తూంటుంది. మీకు ఓ మంచిరోజు అంటే, మీ కుటుంబానికి కూడా కదా..!

– చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news