చాలా మంది అందంగా ఉండటం అంటే తెల్లగా ఉండటం అనుకుంటారు. తెల్లగా ఉండేందుకు చాలా క్రీములు, ఇంకా ఏవేవో బ్యూటీ ప్రొడెక్ట్స్ వాడతుంటారు. ఇండియాలో ఫెయిర్‌నెస్ క్రీములకు బాగా డిమాండ్ ఉంటుంది. అయితే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. అవును, ఫెయిర్‌నెస్ క్రీమ్‌లలో ఉపయోగించే పాదరసం మూత్రపిండాలకు హాని చేస్తుందట.
కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అధిక పాదరసం కలిగిన ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెంబ్రేనస్ నెఫ్రోపతీ (MN) కేసులకు దారితీస్తోంది. ఇది కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తుంది. ప్రోటీన్ లీకేజీకి కారణమవుతుంది. జూలై 2021, సెప్టెంబర్ 2023 మధ్య నివేదించబడిన MN యొక్క 22 కేసులను అధ్యయనం సమీక్షించింది.
‘మెర్క్యురీ చర్మం ద్వారా గ్రహించబడుతుంది.మూత్రపిండాల ఫిల్టర్లను దెబ్బతీస్తుంది. ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసుల పెరుగుదలకు దారితీస్తుంది’ అని పరిశోధకులలో ఒకరైన కేరళలోని ఆస్టర్ మిమ్స్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సజీష్ శివదాస్ ఎక్స్ పోస్ట్‌లో రాశారు.
భారతదేశంలోని నియంత్రణ లేని మార్కెట్లలో విరివిగా లభించే ఈ క్రీములు త్వరితగతిన ఫలితాలను ఇస్తాయని, అయితే వాడటం ఆపడం వల్ల చర్మం మరింత నల్లగా మారుతుందని ఆయన అన్నారు. అటువంటి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేయడం తప్పనిసరి అని పరిశోధకులు తెలిపారు.
తెల్లగా అవ్వాలని ఏది పడితే అది ఎవరి సలహా లేకుండా అస్సలు వాడకూడదు. అలాగే రసాయనాలు ఉన్న క్రీముల కంటే.. ఆర్గానిక్‌గా ఉండేవి కాస్త మంచిది.. అసలు శరీరానికి సంబంధించి ఇంటి చిట్కాలను వాడటం వల్లనే రిజల్ట్ కాస్త లేట్ అయినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఆయుర్వేదంలో ఏన్నో వేల చిట్కాలు ఉన్నాయి.. స్కిన్ సమస్యలను తగ్గించేందుకు, కలర్ పెంచేందుకు.. విరివిగా ఫెయిర్‌నెస్ క్రీములను వాడేవాళ్లు వాటిని ట్రై చేయడం ఉత్తమం.!