షుగర్ కు ప్రత్యామ్నాయంగా అగావే నెక్టార్..ఇది ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది.?

షుగర్ ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు..అందుకే దీనికి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని వైద్యులు అంటుంటారు. అయితే తేనె, బెల్లం, మాప్లే సిరప్ మాత్రమే షుగర్ కు బదులుగా వాడాలని చాలామంది భావిస్తారు. కానీ షుగర్‌కు ప్రత్యామ్మాయం అంతర్జాతీయ మార్కెట్లో మరో ఫుడ్ ప్రొడక్ట్ పేరు వినపిస్తోంది. అదే అగావే నెక్టార్. దీన్ని అగావే సిరప్ అని కూడా అంటారట. షుగర్ కి బదులు వినియోగించే వాటిల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన దీన్ని టకీల, కుకీస్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది ఘగర్ కు మంచిదేనా కాదా అనేది ఈరోజు చూద్దాం.

అగావే అంటే ఏంటి?

ఆగావే అనేది ఓ ఎడారి జాతి మొక్క. అమెరికాలోని దక్షిణ రాష్ట్రాలు, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. అగావే సిరప్ ను ఈ మొక్క నుంచి లభించే వాటితో తయారు చేస్తారు. చాలా కాలం వరకూ.. దీన్ని మెక్సికోలో మాత్రమే వినియోగించేవారు. అగావే నెక్టార్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని భావించారు. అగావే మొక్క నుంచి లభించే ద్రవాన్ని వేడి చేసి తియ్యగా ఉండే మెయిల్ డే అగావే పదార్థాన్ని తయారు చేస్తారు. అగావే షుగర్ ను ఎక్కువ కాలం పులియబెట్టి టకీల తయారు చేస్తారు. మనకు టకీల అయితే బానే తెలిసిఉంటుంది కదా..!

అగావేలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముడి పదార్థాల సేకరణ, ప్రాసెస్సింగ్ పైనే అగావే నెక్టార్ నాణ్యత ఆధార పడి ఉంటుంది. ఈ స్వీట్ ఫ్లూయిడ్ కోసం అగావే మొక్కలను సాగు చేస్తారు. ఇందులో షుగర్, ఆరోగ్యకరమైన ఫైబర్ ఫ్రక్టోస్ ఉంటాయి. మెటబాలిజమ్, ఇన్సులిన్ స్థాయిలపై ఇది ప్రభావం చూపుతుంది.. అయితే అగావే నెక్టార్ తయారీదారులు వ్యాపారంపై దృష్టి పెట్టి ఆరోగ్యకర అంశాలను పక్కకు నెడుతున్నారు. అగావే నెక్టార్ తయారీలో నాణ్యమైన పద్దతులు ఉపయోగించకపోవడం వల్ల అందులోని గుణాలు నాశనం అవుతున్నాయి. ఎంజైములు, ఎక్కువగా మరిగించడం వంటి కారణాలతో అగావే నెక్టార్ ఔషధ గుణాలను కోల్పోతుందట.

అగావే నిజంగా షుగర్ ప్రత్యామ్నాయమా?

తియ్యదనం కోసం మాత్రమే అగావే నెక్టార్ లేదా అగావే సిరప్ వినియోగించాలి అనుకుంటే.. ఓ విషయాన్ని మనం గమనించాలి. అగావే ఉత్పత్తుల్లో ఫ్రక్టోస్ ఎక్కువ స్తాయిలో ఉంటుంది. తియ్యదనానికి ప్రాధాన్యం ఇస్తే ఇన్సులిన్ సిండ్రోమ్(insulin syndrome), మెటబాలిజమ్ సిండ్రోమ్(metabolism syndrome), గుండె జబ్బులు(heart diseases), టైప్ 2 డయాబెటిస్ (type 2 diabetes) కూడా రావచ్చు.

ఎక్కువగా ఫ్రక్టోస్ శరీరంలోకి వెళ్లి కొవ్వుగా మారుతుంది. బ్లడ్‌లో ట్రైగ్లిజరాయిడ్స్ లేవల్స్ పెంచుతుంది. క్రమంగా లివర్ పనితీరు, గుండెపై ప్రభావం చూపుతుందట.. అందుకే తియ్యదనం కోసం అగావే షుగర్ ఉపయోగించడం సరికాదు. ఫ్రక్టోస్ , తక్కువ గ్లైసెమిక్స్ ఉన్న ఇతర పదార్థాలను ఎంచుకోవడమే మేలు.