కఫం మింగేస్తున్నారా..? అసలు అందులో ఏం ఉంటాయో తెలుసా..?

వర్షాకాలంలో జబ్బుల భారిన పడటం సహజం.. అందరికి కామన్‌గా జలుబు, దగ్గు వస్తుంది. ఈ పరిస్థితుల్లో..ఛాతిలో కఫం లేదా శ్లేష్మం వంటివి పడతాయి. దగ్గినప్పుడు నోట్లోకి వస్తుంది. జలుబు అయితే చీదినప్పుడు ముక్కు ద్వారా బయటకు పోతుంది. ఇలా వచ్చినప్పుడు ఊసేస్తే పర్వాలేదు. కానీ కొందరు మింగేస్తుంటారు. అప్పుడు వారున్న ప్రదేశం వల్ల..బయటకు వెళ్లడం కుదరకనో మరేదైనా కారణం చేతనో ఇలా చేస్తుంటారు.. అసలు ఇలా చేయడం చాలా చెత్తపని..ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు. అవునా ఎందుకంత డేంజర్‌..?

కఫం అనేది శ్వాసకోశ మార్గాల శ్లేష్మ స్రావం. శ్లేష్మంలో 95% నీరు, 3% మ్యూకిన్-యాంటీబాడీస్‌తో వంటి ప్రోటీన్లు, 1% ఉప్పు తదితరాలు ఉంటాయి. మ్యూకిన్ బిందువులు నీటిని గ్రహిస్తాయి. అది శ్లేష్మ గ్రంథుల నుంచి విడుదలైన మూడు సెకన్లలో వందల రెట్లు ఉబ్బుతాయి. శ్లేష్మ తంతువులు క్రాస్ లింక్‌లను ఏర్పాటు చేయడం వల్ల కఫం సాగే జెల్‌గా ఉంటుంది.. అందుకే కఫం అంత చిక్కగా జిగటలా కనిపిస్తుంది.

మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు.. కఫం పలుచగా, నీరులా ఉంటుంది. మీకు తెలుసా..మనం రోజుకు 1.5 లీటర్ల కఫాన్ని మింగేస్తాం. ఈ విషయం మనకు తెలియదు కూడా..!. మీకు జలుబు లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నా, లేదా స్మోకింగ్ అలవాటు ఉన్నా.. మీ కఫం చిక్కగా, ముదురు రంగులో మారుతుంది..బ్యాక్టీరియా, వైరస్‌లు, తెల్ల రక్త కణాల, యాంటీబాడీల వల్ల కఫం అలా మారుతుంది.

కఫంలో బ్యాక్టీరియా ఉంటుంది, మింగడం వల్ల అది శరీరం మొత్తం పాకేస్తుంది…అలాగే, మన ఊపిరితిత్తుల్లో కఫాన్ని మరింత పెంచేస్తుంది. ఛాతిలో భారంగా ఉండి, దగ్గు వస్తున్నట్లయితే.. అది చాతి ఇన్ఫెక్షన్‌కు సంకేతం. గొంతులోని కఫం ఊపిరితిత్తుల నుంచి పుట్టిందా? లేదా నాసికా కుహరం వెనుక నుంచి అక్కడికి జారిందా? అనేది నిర్ధారించడం చాలా కష్టం. గొంతులో కిచకిచలాడే శ్లేష్మం ఎక్కడ నుండి వచ్చినా ఛాతీలో ఉన్నట్లే అనిపిస్తుంది. అయితే, దగ్గు వల్ల సమస్య ఏమిటనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు.

రంగునుబట్టి చికిత్స..

ఆకుపచ్చ శ్లేష్మం బ్యాక్టీరియా సంక్రమణను సూచిస్తుంది. దీనికి యాంటీబయాటిక్ చికిత్స అవసరం. శ్లేష్మం ఇంకా పసుపు పచ్చ, నారింజ, గోదుమ, బూడిద రంగుల్లో కూడా ఉంటుంది. శ్లేష్మం రంగును బట్టి వైద్యులు మందులను సూచిస్తుంటారు.